టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. సుదీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు  బెయిల్ వస్తుందని ఆశించిన ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులకు నిరాశే ఎదురైంది. చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో... ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు  గురయ్యారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఏడ్చేశారు. తమ పెళ్లి రోజునే భర్తకు రిమాండ్‌ విధిస్తూ తీర్పు రావడంతో కోర్టులోనే కంటతడి పెట్టుకున్నారు ఆమె. 


సెప్టెంబరు 10న చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి రోజు. ఆ రోజు ఇద్దరూ కలిసి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవాలనుకున్నారు. కానీ... అందుకు ముందు రోజునే సీఐడీ  అధికారులు చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. దీంతో ఆరోజు భువనేశ్వరి ఒక్కరే అమ్మవారి దర్శనానికి వెళ్లారు. నిన్న చంద్రబాబును సీఐడీ అధికారులు చంద్రబాబును కోర్టు  ముందు హాజరపరిచారు. నిన్న చంద్రబాబు-భువనేశ్వరి పెళ్లి రోజు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. దీంతో చంద్రబాబుతోపాటు ఆయన  భార్య భువనేశ్వరి కూడా కోర్టులోనే ఉన్నారు. బాబుకు బెయిల్ వస్తుందని ఆశించినప్పటికీ.. కోర్టు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో... భువనేశ్వరి భావోద్వేగానికి  గురయ్యారు. కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు ఆమెను సముదాయించి ధైర్యం చెప్పారు. 


స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ చంద్రబాబుపై సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. దీనిపై విజయవాడ ఏసీబీ కోర్టులో నిన్న  ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ తర్వాత మూడు నాలుగు గంటల పాటు తీర్పును రిజర్వ్‌ చేసిన కోర్టు... సాయంత్రం 6.45 గంటల  సమయంలో చంద్రబాబుకు రిమాండ్‌ విధిస్తూ తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 22 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే  బాబుకు ఇంటి నుంచి భోజనం, భద్రతా కారణాల దృష్ట్యా జైల్లో ప్రత్యేక గది ఇవ్వాలని ఆదేశించారు. కోర్టు రిమాండ్‌ విధించిన తర్వాత... చంద్రబాబు నుంచి విజయవాడ ఏసీబీ  కోర్టు నుంచి రోడ్డుమార్గంలో రాజమండ్రి జైలుకు తరలించారు. అర్ధరాత్రి ఒంటి గంటల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు.  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇవాళ  రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. ఈ బంద్‌కు జనసేన కూడా మద్దతు తెలిపింది. ఇప్పటికే పలు చోట్లు నిరసనలు మొదలయ్యాయి.