Chandrababu played the role of kingmaker Role 25 year ago : దేశ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబునాయుడు పాత్ర హైలెట్ అవుతోంది. సంకీర్ణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన.. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ మీడియా సంస్థలు ఆయనపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఇప్పటి తరానికి చంద్రబాబు అప్పటి రాజకీయం గురించి పెద్దగా తెలియదు. అప్పట్లో చంద్రబాబు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయనకే ప్రధాని పదవి ఆఫర్ వచ్చినా కొత్తగా సీఎం అయినందున తనకు రాష్ట్రమే ముఖ్యమని వద్దనుకుని ఇతర సీనియర్ నేతల్ని ప్రధానులను చేయడానికి సహకరించారు. అప్పట్లో ఏమయిందంటే ?
రెండు యునైటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభత్వాల్లో చంద్రబాబు కీలకం
1996లో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినంత బలం లేకపోవడంతో హంగ్ పార్లమెంటు ఏర్పడింది. అప్పటికి చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్నారు. వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వం బలం నిరూపించుకోలేక రెండు వారాలకే కూలిపోయింది. దాంతో యునైటెడ్ ఫ్రంట్‌కు కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది. యునైటెడ్ ఫ్రంట్ నుంచి ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడంతో ఫ్రంట్ కన్వీనర్‌గా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌లను ప్రధానమంత్రులుగా నియమించడంలోను, అప్పటి విధాన నిర్ణయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
ప్రభుత్వాలు నిలబడకపోవడంతో వాజ్ పేయి సర్కార్‌కు మద్దతు
1998 ఎన్నికల తరువాత దేశంలో రాజకీయ పరిస్థితులు మళ్లీ మారాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే తాము బయట నుంచి మద్దతిస్తామని, అందుకు ప్రతిఫలంగా తమ పార్టీకి చెందిన దళిత నేత జీఎంసీ బాలయోగిని స్పీకర్ చేయాలని చంద్రబాబు బీజేపీ ముందు ప్రతిపాదన పెట్టారు. అందుకు బీజేపీ సరేననడంతో బాలయోగి స్పీకరయ్యారు. చంద్రబాబు చేసిన పనితో ఆగ్రహించిన ఫ్రంట్ నేతలు ఆయన్ను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ పదవి నుంచి తొలగించారు. ఆ తరువాత టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. వాజపేయి ప్రధానిగా ఉన్నన్నాళ్లు చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. వాజపేయి కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు సలహా లేకుండా నిర్ణయాలు తీసుకునేవారు కాదు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, పథకాలు రాబట్టేందుకు చంద్రబాబు తరుచూ ఢిల్లీ వచ్చేవారు. అయోధ్య అంశంపై కూడా వాజపేయి చంద్రబాబును సంప్రదించేవారు. అప్పటికి తెలుగుదేశం పార్టీకి 29 మంది లోక్‌సభ ఎంపీలు, 18 మంది రాజ్యసభ ఎంపీలు ఉండేవారు. అభివృద్ధి విషయంలో చంద్రబాబు సూచనలను, సలహాలను వాజపేయి కోరుకునేవారు . దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ చేపట్టిన హైవే ప్రాజెక్ట్ ‘స్వర్ణ చతుర్భుజి’ వెనుక చంద్రబాబు సూచనలున్నాయి.
సంకీర్ణ రాజకీయాలు, ఆర్థిక సంస్కరణల్లో బలమైన ముద్ర
చంద్రబాబు రెండు కారణాల వల్ల జాతీయ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. మొదటిది సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం కాగా రెండవది ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేసి, టెక్నాలజీని పరిపాలనలో సమర్థంగా ఉపయోగించడం. గురుచరణ్ సింగ్, చిదంబరం, శ్యామ్ పిట్రోడా, నందన్ నీలేకని, మార్క్‌టుల్లీ లాంటి ఆర్థిక వేత్తలు, సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు, యుకె, అమెరికా యూనివర్సిటీల్లో పలువురు పరిశోధకులు తాము రాసిన పుస్తకాల్లో చంద్రబాబును ప్రశంసించారు.
మళ్లీ ఇప్పుడు చంద్రబాబు కింగ్ మేకర్ అయ్యారు. కాల క్రమంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోవడంతో... తెలంగాణకు దూరం కావాల్సి వచ్చింది. ఫలితంగా సీట్ల తగ్గిపోయింది.అయినా ఆయన ఇప్పుడు మరోసారి కింగ్ మేకర్ అయ్యారు.