Harish Rao Comments in Medak BRS Leaders Meeting: కాంగ్రెస్ అధికారంలోకి 4 నెలల కాలంలోనే ప్రజలను ఇబ్బందులు పెట్టారని.. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'కాంగ్రెస్ హామీలు నమ్మి ఓట్లేసిన ప్రజలు మోసపోయారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పి మాట తప్పారు. రుణమాఫీ డబ్బులు రాలేదని.. బ్యాంకు అధికారులు రైతుల ఇళ్లపై పడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీ జరిగితేనే కాంగ్రెస్ కు ఓటెయ్యండి. అలా కాకుంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యండి. వరి పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని ఇవ్వలేదు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వడ్ల కన్నా వలసలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వంద రోజులు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి చేయలేదు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలి.'  అని హరీష్ రావు పిలుపునిచ్చారు.


రేవంత్ కు రైతులంటే..


'ఎన్నికల ముందు రైతుబంధు పడుతుందని నేను చెప్తే కాంగ్రెస్ ఈసీ దగ్గరికి వెళ్లి ఆపించింది. రైతుబంధు కింద పెంచుతామని చెప్పిన రూ.15 వేలు రాలేదు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను కూడా మోసం చేశారు. కేసీఆర్‌కు రైతు అంటే మొదలు, రేవంత్‌కు రైతులంటే చివర. కేసీఆర్ హయాంలో రైతులకు సమస్యలే లేవు. కరెంటు, నీళ్లు పుష్కలం. మెదక్ సస్యశ్యామలంగా మారింది. 4 నెలల కాలంలో రైతులను ఇబ్బందులు పెట్టారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. రూ.4 వేల పింఛన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 42 లక్షల మంది అవ్వాతాతలను మోసం చేసింది. మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతా బుద్ధి చెప్పాలి. హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలి. పార్లమెంటు ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ, లోకల్ బాడీ ఎన్నికల్లో కారునే గెలిపించాలి.' అని హరీష్ రావు పిలుపునిచ్చారు. 


'మహిళలను మోసం చేశారు'


'కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవాళ్లకు నెలకు రూ.2,500 ఇస్తామని మోసం చేసింది. ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీ కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులకు రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఇంత మోసం చేసిన కాంగ్రెస్ ఓటు వేస్తే గొర్రె కసాయివాడిని నమ్మినట్టే. బీజేపీ కూడా ఓట్ల కోసం వస్తోంది. రఘునందన్ రైతులకు ఎడ్లు, నిరుద్యోగులకు భృతి ఇస్తామని దుబ్బాక ప్రజలను మోసం చేసి గెలిచారు. హామీలు నిలబెట్టుకోని రఘునందన్‌కు ఓట్లేస్తారా?. పదేళ్ల బీజేపీ పాలనలో పేదరికం, నిరుద్యోగం పెరిగింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. కమలం పార్టీ రాముడి పేరుతో రాజకీయం చేస్తోంది. కాంగ్రెస్ ఎలక్షన్ కోడ్ రాజకీయాలు, బీజేపీ ఈడీ రాజకీయాలు చెప్తున్నాయి. వెంకట్రామిరెడ్డి ఉన్నత విద్యావంతులు. ఇక్కడ పదకొండేళ్లు కలెక్టర్‌గా పనిచేశారు. ప్రజల సమస్యలపై అవగాహన ఉంది. ఆయన గెలుపు కోసం కార్యకర్తలు కష్టించి పని చేయాలి.' అని హరీష్ పేర్కొన్నారు. 


Also Read: KCR: 'అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం' - పంట పొలాలు పరిశీలించిన గులాబీ బాస్