BJP leader Kuna Srisailam Goud has joined the Congress party : బీజేపీ నాయకుడు కూన శ్రీశైలం‌గౌడ్ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఓ సారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా  గెలిచారు. ఆ ప్రాంతంలో గట్టి పట్టుకున్న నేత కూడా.  మాస్ లీడర్‌గా కూన శ్రీశైలంగౌడ్ మాంచి పేరుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కుత్బుల్లాపూర్‌లో రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు  లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. 


బీజేపీ మల్కాజిగిరి టిక్కెట్ ఆశించిన శ్రీశైలం గౌడ్                       


కుత్బుల్లాపూర్‌లో ఓడిపోయిన ఆయన.. మల్కాజిగిరి లోక్ సభ టిక్కెట్ ను ఆశించారు. కానీ ఆ సీటును ఈటల రాజేందర్ కు ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు.  గురువారం కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూన శ్రీశైలం ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. 1992 నుంచి యూత్ కాంగ్రెస్‌లో ఉన్న ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ రాకపోవడంతో ఇండిపెడెంట్ గా పోటీ చేశారు. ప్రజల మద్దతుతో గెలిచారు.  కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగాఉన్నారు. 


ఇండిపెండెంట్‌గా గెలిచి.. పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయిన శ్రీశైలం గౌడ్                     


2021లో బీజేపీలో చేరి 2023లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఆశించిన కూన శ్రీశైలంకు పార్టీ మొండి చేయి చూపింది. దీంతో ఆయన గత కొద్ది రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన   కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోనే కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. శ్రీశైలంగౌడ్ రావడంతో కాంగ్రెస్ గెలుపు తేలిక అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 


శ్రీశైలంగౌడ్ చేరికతో కాంగ్రెస్‌కు అదనపు బలం                     


మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటుపై ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. ఈ సీటును కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్నారు.  2009 నుంచి ఇప్పటివరకు మల్కాజ్‌గిరి పార్లమెంటు నుంచి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకసారి టీడీపీ విజయం సాధించింది. దీని పరిధిలోకి మేడ్చల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.