Guntur YCP MP candidate seems Ponnur MLA seat :  గుంటూరు లోక్‌సభ ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో వైఎస్ఆర్‌సీపీకి వరుసగా సమస్యలు వస్తున్నాయి. ఖరారు  చేసిన వారందరూ ఎప్పటికప్పుడు తమకు సీటు వద్దని పక్కకు తప్పుకుంటున్నారు. దీంతో కొత్త వారిని తీసుకు రావాల్సి వస్తోంది. ప్రస్తుతం అభ్యర్థిగా ఖరారు చేసిన కిలారు వెంకట రోశయ్య తనకు ఎంపీ అభ్యర్థిత్వం వద్దని తనకు తన పొన్నూరు ఎమ్మెల్యే సీటే కావాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రోశయ్య ప్రస్తుతం  పొన్నూరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళికి టిక్కెట్ కేటాయించారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఓ విడత ప్రచారం చేసిన రోశయ్య అంత ఆశాజనకంగా పరిస్థితి లేదని అనిపించడంతో మళ్లీ తన పాత స్థానం కోసం ఆయన పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. 


రోశయ్యను అభ్యర్థిగా ఖరారు చేయక ముందే ఈ స్థానానికి  క్రికెటర్ అంబటి రాయుడు పేరును సీఎం జగన్ దాదాపుగా ఫైనల్ చేసుకున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. అయితే అభ్యర్థిగా అధికారిక ప్రకటన చేయక ముందే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత నర్సరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయులును గుంటూరు నుంచి  పోటీ చేాయలని సూచించారు. కానీ ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయి.. నర్సరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. తర్వాత సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రకటించారు కూడా. కానీ రెండు వారాల పాటు ఆయన నియోజకవర్గం వైపే రాలేదు. తనకు ఆసక్తి లేదని చెప్పడంతో..  ఉమ్మారెడ్డి అల్లుడు అయిన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు అభ్యర్థిత్వం ఖరారు చేశారు. 


మొదట్లో పోటీకి ఉత్సాహం చూపిన రోశయ్య.. ఇప్పుడు తనకు వద్దని అంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే రోశయ్య కన్నా బలమైన అభ్యర్థి కష్టమని ఇప్పుడు అభ్యర్థిని మారిస్తే అసెంబ్లీ సీట్లపైనా ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో హైకమాండ్ ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ రాను రను ఆయన ప్రచారంపై ఆసక్తి తగ్గించడంతో ఇప్పుడు పునరాలోచన చేయక తప్పడం లేదంటున్నారు. పార్టీ గెలుపు బాధ్యత తీసుకున్న అళ్ల అయోధ్య రామిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి రోశయ్య సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారని..  సమస్యకు పరిష్కారం చూపాలని కోరినట్లుగా తెలుస్తోంది. 


ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న ఆలోచనలో ప్రస్తుతం వైసీపీ హైకమాండ్ ఉందంటున్నారు. అదే సమయంలో విడదల రజనీ పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఆమె అయితే. టీడీపీ అభ్యర్థి.. ఎన్నారై అయిన పెమ్మసాని చంద్రశేఖర్ కు గట్టి ప్రత్యర్థి అవుతారన్న అంచనాలు ఉన్నాయి. అయితే విడదల రజనీ మాత్రం ఇప్పటికే  గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమెకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదంటున్నారు. చివరికి గుంటూరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుది నిర్ణయం  సీఎం జగన్ తీసుకోాల్సి ఉంది.