Sharmila Story :   తెలంగాణ ప్రజలకు ఓ సందేహం తీరింది. ఇంకా చెప్పాలంటే రెండు రాష్ట్రాల్లో రాజకీయాలను ఫాలో అయ్యే జనాలకు కూడా  ఓ క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ కోడలినంటూ... ఆ గడ్డ మీద కొత్త రాజకీయ జెండా ఎత్తిన వైఎస్ షర్మిలకు రాజకీయాల్లో బ్యాక్ గ్రౌండ్ ఎవరూ అనేది ఓ క్లారిటీ వచ్చేస్తోంది. తెలంగాణలో షర్మిలను టార్గెట్ చేస్తున్న కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు.. దాని పర్యవసనాలు... చూసిన తర్వాత.. రాజకీయ పరిశీలకులకు ఈ రాజకీయ పార్టీ వెనుకుంది.. బీజేపీ అన్న క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే రెండు రోజుల కిందట జీ-20 సదస్సుల కోసం ఏర్పాటు చేసిన అఖిల పక్షం సమావేశంలో ప్రధాని మోదీ.. షర్మిళ విషయంలో జరిగిన పరిణామాలపై ఆమె అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. ఆ మరుసటి రోజు ఆయనే నేరుగా షర్మిలకు ఫోను చేసి పదినిమిషాలు మాట్లాడారు అన్న విషయం బయటకు వచ్చింది. అయితే అధికారికంగా ఎవరూ చెప్పుకోరు.. చెప్పరు... కానీ అసలు షర్మిల చేస్తోంది ఒంటరి పోరా.. ఆమెకు ఏదైనా పెద్ద రాజకీయ పార్టీ అండ ఉందా అన్న అనుమానాలకు కాస్తంత సమాధానం కనిపించింది ఈ విషయంతో.. !


బీజేపీ వదిలిన బాణం షర్మిల !


రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో తీసుకురావాలన్నదే ప్రథాన అజెండా అని చెప్తూ.. దాదాపు ఏడాదిన్నరగా పొలిటికల్ ఫైట్ చేస్తున్నారు షర్మిల. ఉద్యోగ దీక్షలు చేశారు.. ఉద్యమాలు నడిపారు. పాదయాత్రలు చేస్తున్నారు. ఫిర్యాదులు చేశారు. తెలంగాణ సీఎం కుటుంబాన్ని డైరక్ట్ అటాక్ చేశారు. ఇదంతా ఆమె ఏడాదిన్నర గా చేస్తున్న రాజకీయం. కానీ గ్రౌండ్ లెవల్ రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి అర్థమయ్యేదంటే.. ఆమె  ఎంత ఆర్గనైజ్డ్ గా పార్టీని నడిపిస్తున్నా.. పాదయాత్రలు చేస్తున్నా.. మీడియాలో కనిపిస్తున్నా.. ఆమె ప్రభావం మాత్రం అంతంతే. అది అందరికీ తెలుస్తోంది. అడపాదడపా అధికార పార్టీ మంత్రులు రెస్పాండ్ అయ్యారు తప్ప.. టీఆరెఎస్ అధినాయకత్వం ఆమెను సీరియస్ గా తీసుకుంది తక్కువే. అయితే పది రోజుల కిందట ఉమ్మడి వరంగల్ జిల్లా పాదయాత్రలో షర్మిల యాత్రలోని బస్సు తగులబడింది. ఇది టీఆరెస్ కుట్ర అంటూ ఆమె భగ్గుమన్నారు. ఏకంగా ప్రగతి భవన్ ముట్టడికే బయలుదేరారు. స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ షర్మిల వచ్చేయడం.. ఆమె వాహనాన్ని తాను కారులో ఉండగానే టోయింగ్ చేసి ఎస్ ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లడం.. ఆమెను అరెస్టు చేయడం.. ఇలా వరుసగా జరిగిన పరిణామాలతో షర్మిల టాక్ ఆఫ్ ది తెలంగాణ అయ్యారు ఆ రెండు రోజులు. అప్పుడు టీఆరెఎస్ లో కీలక నేత కవిత రియాక్ట్ అయ్యారు. షర్మిలను కారులో ఉండగానే టోయింగ్ చేస్తూ తీసుకెళ్లడంపై గవర్నర్ తమిళసై తొలుత స్పందించారు. ఆ పద్ధతి సరిగ్గా లేదని విమర్శించారు. దీనిపై స్పందించిన కవిత .. కమల “బాణం” ఓ కవిత వదిలారు. దాంతో షర్మిల అదే పద్దతిలో ట్వీట్ చేశారు. వీళ్లిద్దరి మధ్యా ట్వీట్ వార్ నడిచింది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ద్వారా షర్మిల బాక్ గ్రౌండ్ బీజేపీ అని టీఆరెఎస్ ఎస్టాబ్లిష్ చేసింది.


టీఆర్ఎస్ టార్గెట్ చేయడంతో పొలిటికల్‌గా వెలుగులోకి షర్మిల 


అసలు వైఎస్ షర్మిల రెడ్డి.. ఉన్నట్టుండి తెలంగాణలో పార్టీ పెట్టడమే చాలా మందికి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఆమె తండ్రి మాజీ ముఖ్యమంత్రి .. రాజశేఖరరెడ్డి.. రాయలసీమ ప్రాంతానికి చెందిన నేత. ఆమె అన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆమె కుటుంబం.. బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా రాయలసీమనే.  పార్టీ ఏర్పాటుకు ముందు అన్నతో విబేధాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజం అని ప్రూవ్ చేసేలా బహిరంగంగానే వాళ్లిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండటం అంతా చూశారు. సో.. కుటుంబంలో ఏదో జరిగింది అనుకున్నారు. ఆమె రాజకీయంగా సొంత ప్రయత్నాలు చేస్తున్నారు అన్న వార్త వచ్చింది. కానీ విచిత్రంగా ఆమె.. తన తండ్రికి బలం ఉన్న ఏపీ కాకుండా తెలంగాణలో అడుగుపెట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రారంభించేశారు. ఇది రెండు రాష్ట్ట్రాల ప్రజలకు షాక్ ఇచ్చింది. అన్నతో ఇష్యూ ఉంటే అక్కడ తేల్చుకోవాలే కానీ.. ఇక్కడేంది అంటూ తెలంగాణ ప్రజాసంఘాల నుంచి విమర్శలు ఎత్తిపొడుపులు వచ్చాయి. అయితే వీటన్నింటినీ ఆమె కేర్ చేయలేదు. తాను తెలంగాణ కోడలినన్నారు. హైదరబాద్ లో పుట్టిపెరిగానన్నారు. ఇక్కడే బోనమెత్తానని చెప్పారు. నేరుగా యాక్షన్ లోకి దిగేశారు. షర్మిల రాజకీయ పార్టీ పెట్టి .. రాజకీయ విమర్శలైతే చేశారు కానీ.. ఎక్కడా  ఆ పార్టీని ఓ రాజకీయ సంస్థగా తెలంగాణ సమాజం  గుర్తించలేదు. ఓ ఆర్గనైజ్డ్ గా సాగే.. ఓ సంస్థ కార్యక్రమాలుగానే భావించారు. కానీ షర్మిల వదల్లేదు. ఉద్యోగాలు రాక చనిపోయిన కుటుబాలను పరామర్శించి.. దీక్షలు చేసి.. చివరకూ కాళేశ్వరం అవినీతి పై కేంద్రానికే ఫిర్యాదు చేశారు. మొన్న జరిగిన ఎపిసోడ్ తో పోలిటికల్ ఫ్లడ్ లైట్ లోకి వచ్చారు. 


షర్మిలకు మద్దతుగా నిలుస్తున్న  బీజేపీ - నేరుగా మోదీ ఫోన్  చేశారని ప్రచారం 


అయితే ఆమె పార్టీ పెటినప్పటి నుంచి రాజకీయ పరిశీలకులకు ఓ డౌట్. తెలంగాణలో షర్మిల పార్టీ అన్నదే అంతగా అతకని విషయం. ఇక్కడ కొట్లాడి గెలవడం కూడా ఈజీ కాదు. పైగా రాజశేఖరరెడ్డికి సమైక్య వాదిగా ముద్ర ఉంది. ఆయన కూతురిగా ఆయన రాజ్యం తెస్తానంటూ చెబితే తెలంగాణలో ఎలా అంగీకరిస్తారు. అందుకే ఇది సీరియస్ పార్టీ కాదు. ఏదో ఓ రాజకీయ పార్టీకి బీ టీమ్ అనే అనుమానాలు మొదలయ్యాయి. జగన్ -కేసీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా.. జగన్ సహకారంతోనే .. టీఆరెఎస్ ఆశిస్సులతో షర్మిల ఇక్కడకు వచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ మద్దతుదారుల ఓట్లను సంపాదించడం.. కాంగ్రెస్ కు అండగా ఉండే మైనారిటీ ఓట్లను చీల్చాలనే ఉద్దేశ్యంతో టీఆరెస్ తీసుకొచ్చిందన్న అంచనాలుండేవి. ఇంకోవైపు అలాంటి పార్టీని బీజేపీ ఫ్లోట్ చేస్తుందనే ఊహాగానాలున్నాయి. ఇప్పటికే ఓవైపీ పార్టీపై అలాంటి విమర్శలున్నాయి. యాంటీ బీజేపీ ఓటును చీల్చడం కోసం ఓవైపీ పార్టీ బీజేపీకి సహకరిస్తోందన్న విమర్శలు అవి.. అలాగే టీఆరెస్ కు మద్దతుగా ఉండే.. వర్గాల ఓట్లను చీల్చడానికి.. మఖ్యంగా క్రిష్టియన్ మైనార్టీ ఓట్లే టార్గెట్ గా షర్మిలను రంగంలోకి దించారు అనే ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ చాన్నాళ్ల వరకూ అసలు ఆమెకు సపోర్టు ఎవరు.. ఓ కారణంతో తెలంగాణలో అడుగుపెట్టారన్నది ఓ ప్రశ్నలానే మిగిలిపోయింది. 


జగన్‌ను ఇరుకున పెట్టేలా వ్యవహారిస్తున్న బీజేపీ 


ఈ ఒకటిన్నర ఏళ్లలో షర్మిల మొదటి టార్గెట్ టీఆరెస్ లానే కనిపించింది. ఆ తర్వాత కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి లాంటి వాళ్లతో గొడవ జరిగింది. కానీ బీజేపీపై ఎక్కడా విమర్శలు చేసినట్లు లేదు. అటు బీజేపీ నేతలు కూడా షర్మిలపై ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రగతి భవన్ ముట్టడి అనే ఘట్టం తర్వాత... బీజేపీ షర్మిల విషయంలో సాప్ట్ కార్నర్ తో ఉందన్న విషయం బయటపడింది. ఏకంగా ప్రధానమంత్రే ఆమె అన్నని.. దీని గురించి ప్రశ్నించారని.. ఆ తర్వాత ఆయన నేరుగా ఫోన్ చేశారని వార్తలు రావడం చూస్తుంటే.. ఈ పార్టీతో ఫ్రెండ్లీ అవగాహనతో బీజేపీ వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ కు షర్మిలకు మధ్య వైరం వ్యక్తిగతంగా మారడంతో ప్రధాని నిజంగా ఇలా అడిగి ఉంటే కనుక అది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పెట్టే విషయమే. సొంత చెల్లెలి విషయంలో రూడ్ గా వ్యవహరించిన ప్రభుత్వాన్ని కనీసం జగన్ ప్రశ్నించలేదని.. మానవతా దృక్పధంతో కూడా మాట్లాడలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రధాని ఈ విషయం ప్రస్తావించినప్పుడు.. జగన్ దగ్గర సమాధానం లేకుండా పోయిందని పత్రికలు రాసుకొచ్చాయి. ఇందులో నిజానిజాలు తెలీదు. మరి తెలంగాణలో షర్మిలతో  అవగాహనతో వెళితే ఆంధ్రా లో పరిస్థితేంటి..  జగన్ టీఆరెస్ తో కిందటి ఎన్నికలకు ముందు సన్నిహితంగా ఉన్నారు. తర్వాత కూడా ఉన్నారు. ప్రభుత్వ మంత్రుల మధ్య వాదోపవాదాలు జరిగాయి కానీ జగన్ బహిరంగంగా పొరుగు రాష్ట్రంపై ఇబ్బందికరంగా ఇప్పటి వరకూ మాట్లాడలేదు. 


షర్మిలకు  ప్రోత్సాహం అంటే జగన్‌ను దూరం పెట్టడమేనా ? 


 మరి బీజేపీ తెలంగాణలో తీసుకుంటున్న స్టాండ్., బీజేపీ తో మైత్రి నడుపుతున్న జగన్ ను ఎంత వరకూ ప్రభావం చూపుతుందన్నది చూడాలి. అలాగే తెలుగుదేశం పట్ల కూడా బీజేపీ వైఖరి ఇంతకు ముందు కంటే మారింది. ఢిల్లీలో రెండు సందర్భాల్లో చంద్రబాబుతో కలిసిన విధానం, ఆ పార్టీ విషయంలో విమర్శలు విషయంలో బీజేపీ వెనక్కు తగ్గింది. ఇప్పుడు అంతా బాగుంది అన్నరీతిలో లేకపోయినా.. 2019 నాటి పరిస్థితులైతే లేవన్నది నిజం. ఇక్కడ బీజేపీకి టీడీపీతో అవసరం కూడా ఉంది. తెలంగాణ అన్నది ఆ పార్టీకి చాలా ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడ  ఏ కాస్త ప్రభావం ఉన్న పార్టీ అయినా వాళ్లకి ఉపయోగమే. హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో సెటిలర్స్ ఎక్కువ. ఇప్పటికీ వాళ్లకి టీడీపీ పట్ల సానుభూతి ఉంది. అలాగే బీజేపీ ప్రభావం తక్కువుగా ఉండే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా టీడీపీ ఆ పార్టీకి ఉపయోగపడొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. టీడీపీతో ప్రస్తుతానికి దగ్గరి సంబంధాలు నడుపుతున్నట్లు అర్థం అవుతోంది. అయితే.. రాజకీయ పొత్తులు అవగాహనలకు అతీతంగా జగన్ మోహనరెడ్డి కేంద్రంతో సంబంధాలను నెరుపుతున్నారు. కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణయాలకు మద్దతు తెలిపారు. కేంద్రానికి ఇబ్బంది కలిగించే  ఏ చిన్న పనీ చేయడం లేదు. కేంద్రం పట్ల పూర్తి విధేయత కనబరుస్తున్నారు. అయితే .. అనివార్యమైన తెలంగాణ పరిస్థితులు.. అత్యంత ధృఢంగా ఉన్న .. ఇన్విజిబుల్ గా ఉన్న వైసీపీ- బీజేపీ బంధాన్ని ఎలా మారుస్తాయన్నది చూడాలి.