Counter To YSRCP :  వైఎస్ఆర్‌సీపీ నిర్వహించిన జయహో బీసీ బహిరంగసభపై విప్కష నేతలు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ పాలన సాగించారని.. ఇప్పటికీ అదే పని చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఎలాంటి మేలూ చేయలేదన్నారు.


శ్వేతపత్రం విడుదల చేయాలన్న బీజేపీ ! 


బిసిలకు  గత మూడున్నర సంవత్సరాలుగా ఏం చేసిందీ వైసీపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు.  బిసిలకు గుర్తింపు తెచ్చి, వారిలో నాయకత్వ లక్షణాలు నేర్పింది ఎన్టీయార్ అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో బిసిలకు చేసింది ఏమి లేదని,కేంద్రంలో ఉన్న బిజేపి బిసిలను గుర్తిస్తుందని చెప్పారు.వైసిపి బిసి కార్పొరేషన్ లను ప్రారంభించిందని అయితే  నిధులు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. బిసి కులాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో బిసి కార్పొరేషన్లు వున్నాయి బీసీలకు ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం ద్వారా బహిర్గతం చేయాలన్నారు. 


భయహో బీసీ అని పేరు పెట్టాల్సిందన్న జీవీఎల్ !


బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీలను ఉద్దరిస్తున్నామని బీసీ సభ పెట్టారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.  జయహో బీసీ కాదు.. భయహో బీసీ సభ పెట్టాలని వ్యాఖ్యలు చేశారు. నిధులు, వనరులు లేకుండా బీసీ కార్పొరేషన్లు పెట్టి బీసీలను మోసం చేశారని విమర్శించారు. 50 శాతం పైగా ఉన్న బీసీలకు వైసీపీ ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత, పద్మశాలి, యాదవులకు టికెట్లు ఇవ్వలేదన్నారు. అలంకార ప్రియమైన పదవులతో బీసీలకు ఒరిగింది ఏమి లేదని అన్నారు. వైసీపీ భయభ్రాంతులకు గురి చేసిన బీసీలకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే భవిష్యత్‌లో బీసీలు వైసీపీని నమ్మరని జీవీఎల్ స్పష్టం చేశారు. 


బీసీల ప్రాణాలపై వైసీపీ పునాదులు ! 


 బీసీ గర్జన పేరుతో బీసీలను మోసం చేస్తున్నారని వైసీపీపై టీడీపీ మండిపడింది.  బీసీల ప్రాణాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పునాది వేసుకొందని కొల్లు రవీంద్ర ఆరోపించారు.  జగన్ కొద్ది మంది బీసీలకు పదవుల బిస్కెట్ వేసి కుక్కల్లా మొరిగిస్తున్నారన్నారు.  చంద్రబాబు   ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు విదేశీ విద్య అందించామని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరు మార్చి విద్యా దీవెన పేరుతో విద్యార్థులను మోసం చేశారన్నారు. గత ప్రభుత్వం హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 6 లక్షల మంది విద్యార్థులకు విద్యా దీవెన అందిస్తోందన్నారు. 54మందికి కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినా కుర్చీలు కూడా లేవని తెలిపారు. రాష్ట్రాన్ని సామాంతరాజులుగా విడగొట్టి విజయసాయిరెడ్డి, సజ్జల రామక్రిష్ణ రెడ్డి ,వైవి సుబ్బారెడ్డిలకు అప్పగించారని మండిపడ్డారు. బీసీ అభివృద్ధి కోసం ఏటా బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి.. కేవలం రూ.150 కోట్లు కేటాయించారని కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు.


టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు 
 
విజయవాడలో వైసీపీ జయహో బీజేపి సభ నిర్వహిస్తున్న నేపద్యంలో ప్రతిపక్ష పార్టిల ఆందోళనల పై పోలీసులు నిఘా పెట్టారు.  టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంటకన్నను   పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.బీసీలకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని,బిసిలను ఉన్నత స్ధాయికి తీసికెళ్ళింది చంద్రబాబు అని తెలిపారు.చంద్రబాబు రోడ్ షోలలో బిసిలు ఎక్కువగా పాల్గొంటున్నారనే జయహో బిసి ని వైసీపీ నిర్వహించిందన్నారు.