Andhra Pradesh News: రాజకీయాల్లో ఏ నిర్ణయమైనా సరే అంత ఆషామాషీగా తీసుకోరు నాయకులు. నాన్నకు ప్రేమతో సినిమాలో చెప్పినట్టు బటర్‌ఫ్లై ఎఫెక్ట్ పాలిటిక్స్‌లో కచ్చితంగా ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కీలక నేతలు తీసుకున్న నిర్ణయం వెనుకాల చాలా పెద్ద స్కెచ్ ఉంటుంది. అలాంటిదే విజయసాయి రెడ్డి రాజీనామా. ఇప్పుడు రాజీనామాతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన పావులు కదపబోతోంది.
వైసీపీకి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. తనకు రాజకీయాలతో సంబంధంలేదని ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయడం అది ఆమోదం పొందడం జరిగిపోయింది. ఈ రాజీనామా కేంద్రంగానే బీజేపీ ఎత్తులు పై ఎత్తులు వేస్తోందని సమాచారం. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణలో కీలక నిర్ణయాలు తీసుకుటుందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి కోసం అన్వేషణ
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ప్రస్తుతం పురందేశ్వరి ఉన్నారు. ఆమె స్థానంలొ కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఎప్పటి నుంచో కాషాయ నాయకత్వం యోచిస్తోంది. దీని కోసం అనేక సమీకరణాలను పరిశీలిస్తోంది. యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలా లేకుంటే సామాజిక లెక్కలు చూసుకొని అధ్యక్షుడిని ఖరారు చేయాలా అనే అంశంపై గత కొన్ని రోజులుగా చర్చలు సాగిస్తోంది.
వైసీపీలో విజయసాయి రెడ్డికి ఎప్పటి నుంచో ఉక్కపోత
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి నియామకం విషయంలో చర్చలు సాగుతున్న టైంలోనే విజయసాయి రెడ్డి ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. మొదటి నుంచి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన సొంత పార్టీలో మూడు నాలుగేళ్లగా ఉక్కపోతకు గురవుతున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడీ జరిగిన తర్వాత వైసీపీలో ఆయనకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. అందుకే బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేశారట. అలాంటి ప్రయత్నాల్లో పార్టీ మారడం కూడా ఒకటిగా చెబుతున్నారు.
బీజేపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి ఓకే- టీడీపీ నాట్ ఓకే
వైసీపీకి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసిన టైంలోనే విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయన వీటిని ఖండించారు. కానీ అది నిజమేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు చాలా విధాలుగా ప్రయత్నాలు చేశారట. అయితే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరితే తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మిత్ర పక్షాలైన టీడీపీ, జనసేన అభ్యంతరం వ్యక్తం చేశాయిట.
టీడీపీ అయితే విజయసాయి రెడ్డి ప్రయత్నాలకు పూర్తిగా రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ బీజేపీలో ఆయన చేరితే మూడు పార్టీల నేతలు, కేడర్‌తోపాటు రాష్ట్ర ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ అధినాయకత్వానికి వివరించారు. ఇది రాజకీయకంగా కూడా చాలా పెను ప్రభావం చూపుతుందని తెలిపారట. జరగబోయే పరిణమాలు వివరించారట. అందుకే ఆయన్ని చేర్చుకోకపోవడమే మంచిదని నచ్చజెప్పారని టాక్.
బీజేపీ నేతలు కూడా రెడ్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లో రెండు మిత్ర పక్షాలతోపాటు, రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా అందుకే అంగీకరించలేదు. ఆయన రాకతో ప్రజల్లో పలుచన అవుతాని కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇచ్చినట్టేని గట్టిగానే చెప్పారని తెలుస్తోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ అధినాయకత్వం పరిస్థితిని విజయసాయి రెడ్డికి వివరించింది. రాజీనామా చేసి సైలెంట్‌గా ఉండాలని కోరింది. పార్టీలో చేరికకు అంగీకరిస్తేనే తాను రాజీనామా చేస్తానంటూ చెప్పేశారు. ఎలాంటి లబ్ధి జరగనప్పుడు తాను ఆ సీటును కూటమికి ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న ఆయన నుంచి వచ్చింది.
Also Read: విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేష్, అనంతరం యువగళం పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
విజయసాయి రెడ్డి రాజీనామాకు ఇలా పీఠముడి పడటంతో బీజేపీ అధినాయకత్వం ఆలోచనలో పడింది. కీలకమైన జమిలీ ఎన్నిల బిల్లు ఆమోదం పొందే నాటికి రాజ్యసభలో మెజార్టీ సాధించాలని భావిస్తున్న ఆ పార్టీ అడుగులు ముందుకు పడకుండా పోయాయి. ఈ టైంలోనే లీడ్ తీసుకునేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ముందుకు వచ్చారు. విజయసాయిరెడ్డిని ఒప్పించే బాధ్యతను తీసుకున్నారట.
విజయసాయిరెడ్డిని ఒప్పించిన చౌదరి
ఏ పార్టీలో చేరకుండా రాజీనామా చేసి సైలెంట్‌గా ఉండేలా విజయసాయిరెడ్డిని ఒప్పించడంలో సుజనా చౌదరి విజయవంతమయ్యారట. ఆయన ప్రోత్బలంతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇలా చేసేందుకు ఆయనకు కీలకమైన హామీలు లభించాయనే టాక్ నడుస్తోంది. ఎవరి ఒత్తిడి, ఎలాంటి లబ్ధి లేకుండానే తాను రాజీనామా చేసినట్టు విజయసాయి రెడ్డి చెప్పిప్పటికీ తెరవెనుక పెద్ద మంత్రాంగమే నడిచిందని అంటున్నారు.
ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టనుంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఈ సీటు కేటాయించనుంది. మరోవైపు విజయసాయి రెడ్డి కుమార్తె రాజకీయం అరంగేట్రానికి కూడా బీజేపీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో ఆమె త్వరలోనే చేరనున్నారు. దీనికి విజయసాయి రెడ్డి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సుజనాచౌదరికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించలేని పరిస్థితి ఉంది. అందుకే ఆయన్ని ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేయబోతున్నారని తెలుస్తోంది. విజయసాయిరెడ్డితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దినందుకు ఆయనకు అధ్యక్షపదవి బీజేపీ ఆఫర్ చేస్తోందని సమాచారం. ఈ వారంలో ఈ ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఈ పదవి కోసం చాలా మంది పోటీ ఉన్నప్పటికీ సుజనా చౌదరి అయితే మిత్ర పక్షాలు కూడా ఓకే చెప్పారని సమాచారం. ఇదన్నమాట ఆంధ్రప్రదేశ్‌లో బటర్‌ఫ్లై ఎఫెక్ట్ రాజకీయాలు.