AP BJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు .. రాష్ట్రంలో తమదైన ముద్ర వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా రాష్ట్రంలోని 13 వేల గ్రామాల్లో పది వేల కిలోమీటర్ల మేర పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయంచారు. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనుంది. ఇటీవల వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు పోరాటం ఉద్ధృతం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కూడా తరచూ ఏపీలో పర్యటిస్తున్నరు. జనవరి రెండో వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పర్యటించబోతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ మరింత ఉద్ధృతంగా కార్యకలాపాలను నిర్వహించాలనుకుంటోంది.
13 వేల గ్రామాల్లో పాదయాత్రలు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు గ్రామ, గ్రామానికి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కేంద్ర బీజేపీ నుంచి వస్తున్న సూచనల మేరకు పాదయాత్రలకు రెడీ అవుతున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రతీ గ్రామంలోనూ భారతీయ జనతా పార్టీ ఉనికిని చాటినట్లవుతుంది. బీజేపీపై అభిమానం ఉన్నప్పటికీ .. సంస్థాగతంగా లేని నిర్మాణం వల్ల కొంత మంది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితిని పాదయాత్ర ద్వారా అధిగమించి గ్రామాల్లోని బీజేపీ అభిమానులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ పాదయాత్రలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం చేయడం ద్వారా.. ప్రత్యామ్నాయం తామేనన్న భావన ప్రజలకు కల్పించేలా బీజేపీ పోరాటం ఉండనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు సక్సెస్ - ఆ స్ఫూర్తితో పాదయాత్రలు
ఇటీవల బీజేపీ వినూత్నంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదారు వేల సభలను నిర్వహించింది. భారీ బహిరంగసభ జోలికి వెళ్లకుండా కాలనీలు.. గ్రామాల్లో ఈ సభలను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధాన పార్టీతో పోలిస్తే.. పార్టీ క్యాడర్ తక్కువే ఉన్నప్పటికీ.. ఉన్న క్రియాశీల కార్యకర్తలు, నేతలతోనే విస్తృతంగా నిర్వహించిన ఈ సమావేశాలపై మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఏపీ బీజేపీ ప్రధాన కారదర్శి విష్ణువర్దన్ రెడ్డి నేతృత్వంలో ఇవి జరిగాయి. పాదయాత్రల బాధ్యతలనూ ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా బాధ్యతలను ఇప్పటికే ఆయనకు ఇచ్చారు.
ఏపీలో బీజేపీ బలోపేతంపై హైకమాండ్ ప్రత్యేకదృష్టి !
జాతీయ రాజకీయాలు లేదా ఇతర కారణాలు ఏమైతేనేం ఇంత కాలం ... బీజేపీ హైకమాండ్ పెద్దగా ఏపీలో బీజేపీ బలోపేతంపై పట్టించుకోలేదు.కానీ ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ నేతలకు వరుసగా టాస్క్‌లు ఇస్తున్నారు.. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు వరుసగా ఏపీకి వస్తున్నారు. అమిత్ షా కూడా వస్తున్నారంటే.. ఖచ్చితంగా ఏపీపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టిందని నమ్ముతున్నారు. ఇంత కాలం హైకమాండ్ పెద్దగా పట్టించుకోకపోతూండటంతో ఏపీ బీజేపీ నేతలకూ దిశానిర్దేశం లేకుండా పోయింది. ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండదని.. .. తెలంగాణ తరహాలో పార్టీ ముందుకెళ్తుందనే విశ్వాసంతో ఆ పార్టీ నేతలున్నారు