Simhachalam Incident : "సింహాచలంలో ఆ ఒక్క దుర్ఘటన మినహా మిగిలిన కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతున్నాయి". సింహాచలం ఆలయ ఆవరణలో గోడకూలి ఏడుగురు చనిపోయిన తర్వాత ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. జరగాల్సిందంతా జరిగిపోయి ఏకంగా ఏడుగురు చనిపోయాక మిగిలిందంతా సజావుగా సాగడం ఏంటో ఆయనకే తెలియాలి. ఆయననే కాదు సింహాచలం చందనోత్సవం సూపర్ సక్సెస్ చేయాలని ఈ మధ్య మంత్రులు వైజాగ్‌కు క్యూ కట్టారు. 

కూటమి అధికారంలోకి వచ్చిన జరుగుతున్నతొలి చందనోత్సవం కావడంతో ఎలాగైనా దీన్ని సూపర్‌గా జరిపి చంద్రబాబుతో భేష్ అనిపించుకోవాలన్న తాపత్రయంతో కష్టపడ్డారు మంత్రులు. హోం మంత్రి అనిత సహా మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి, అనగాని సత్య ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్‌లు ఇక్కడి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ ఐదుగురిలో డోలా వీరాంజనేయ స్వామి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కాగా మిగిలిన నలుగురు ఏర్పాట్ల కమిటీలో ఉన్నారు. 

వరుస సమీక్షలు సమావేశాలతో మంత్రులు బిజీగా ఉన్నారు. దానితో అధికారులు వాళ్ల చుట్టూ ఉండాల్సిన పరిస్థితి. అసలు అధికారులకు ఆలయ ఏర్పాట్లపై దృష్టి పెట్టి అంత టైం దొరికిందా అన్న సందేహాలు భక్తుల నుంచి వెలువడుతున్నాయి. ఎంతసేపూ భక్తులకు మంచినీళ్లు మజ్జిగ ప్యాకెట్లు, ట్రాఫిక్ లాంటి సమస్యలపై దృష్టి పెట్టడమే తప్ప వాతావరణ పరిస్థితులపై అంచనా వేయలేకపోవడం సింహాచలం ఘటనకు ప్రధానమైన సమస్య చెప్తున్నారు. 

దేశ ప్రధాని అమరావతికి వస్తున్నవేళ రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం కచ్చితంగా ఒక మచ్చగా మారే అవకాశం ఉంది. పైకి అంతా బాగానే ఉన్నా ఎక్కడో సమన్వయ లోపం ఉన్న మాట వాస్తవమే అన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ముఖ్యమైన ఈవెంట్‌ల్లో అయితే అతివృష్టి.. లేదా అనావృష్టి అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహార శైలి ఉంది అన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఆ మధ్య జరిగిన తిరుపతి ఘటనలో అధికారులది తప్పైతే మరి ఇప్పుడు సింహాచలం ఘటనలో తప్ప ఎవరిది? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అనే ప్రశ్నలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. 

పోనీ కూలిన గోడ ఏదైనా పురాతనమైందా అంటే అదీ కాదు. మరి ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలి. ఇటీవల 53 కోట్ల రూపాయలతో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ పనులు అందుకున్న కాంట్రాక్టర్ తప్పా.. తప్పా అనేది కూడా తేలాలి. ఒకవేళ ఎలాంటి దుర్ఘటన లేకుండా ఈ కార్యక్రమం సక్సెస్ అయి ఉంటే కచ్చితంగా క్రెడిట్ మాది అంటే మాదే పోటీపడేవారు అందరూ. ఇప్పుడు పోయిన ఈ ఏడు ప్రాణాల బాధ్యత ఎవరిది అనేది ప్రభుత్వమే తేల్చాల్సి ఉంది 

క్లౌడ్ బరస్ట్‌ అసలు కారణం?ఈ దుర్ఘటనకు కారణం ఒక్కసారిగా మారిపోయిన వాతావరణ పరిస్థితి. దాదాపు 30 నుంచి 40 నిమిషాలపాటు ఏకధాటిగా కరిసిన భారీ వర్షం.. విపరీతమైన వేగంతో వీచిన గాలి అంటున్నారు స్థానికులు వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అది కొత్తగా కట్టిన గోడ అయినప్పుడు.. అంత భారీ గాలివాన కురుస్తున్నప్పుడు అక్కడ జనం ఎలా ఉన్నారనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.

ఎక్కడో సమన్వయ లోపం ఉంది?ఏదేమైనా కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు ప్రధానమైన ఘటనలు జరగడంతో ఎక్కడో ప్రభుత్వానికి అధికారులకి జనాలకి మధ్య ఒక సమన్వయ లోపం నెలకొన్న పరిస్థితి కళ్ళ ముందు కనబడుతుంది అంటున్నారు విశ్లేషకులు. మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు జరుగనున్న తరుణంలో ఇలాంటి లోపాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.