Bhimavaram Latest News: గోదావరి జిల్లాలకు ఆర్థిక రాజధాని గా పేరొందిన భీమవరానికి అరుదైన అవకాశం లభించింది. ఈ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్రంలో ఒకే పార్టీ నుంచి ఎంపీలుగా ఉన్నారు. అది కూడా ఒకే సమయంలో నరసాపురం నుంచి ఎంపీగానూ కేంద్ర మంత్రి గానూ ఉన్న శ్రీనివాస్ వర్మ, రెండు రోజుల క్రితం బిజెపి నుంచి రాజ్యసభ సీటు పొందిన  పాకా సత్యనారాయణ ఇద్దరూ భీమవరం వాస్తవ్యులే. ఇలా ఒకే సమయంలో ఒకే పార్టీ నుంచి ఒకే ఊరికి చెందిన ఇద్దరు ఎంపీలుగా ఉండడం అరుదైన ఘటనగానే చెప్పాలి. అందులోనూ 1996లో నరసాపురం ఎంపీగా బిజెపి నుంచి  పాక సత్యనారాయణ పోటీ చేస్తే ఆయనకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ప్రస్తుత నర్సాపురం ఎంపీ కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పనిచేశారు అంటారు. ఇప్పుడు కట్ చేస్తే ఇద్దరూ అదే బిజెపి నుంచి ఎంపీలుగా ఉన్నారు. మూడు దశాబ్దాలుపైబడి పార్టీకి కట్టుబడి ఉన్నందుకు ఈ ఇద్దరు సీనియర్ నేతలకు బిజెపి హైకమాండ్ ఇచ్చిన గుర్తింపు ఇది. ఇది భీమవరానికి ఒక గర్వకారణమైన రోజు అని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

భీమవరం అంటే.. మోదీ అయినా రావలసిందే

గత కొన్నేళ్లలో భీమవరం ఆర్థికంగా చాలా ఉచ్చస్థితికి చేరుకుంది. అక్కడి రాజులు ఏం చెబితే అది ఢిల్లీ స్థాయిలో జరిగిపోవాల్సిందే. వాళ్ల పలుకుబడి ఆరేంజ్‌కు వెళ్ళిపోయింది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు బిజెపి నుంచి ఎంపీగా కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే భీమవరం రాజులు బిజెపికి దగ్గరయ్యారు. కృష్ణంరాజు తమ్ముడు కొడుకు ప్రభాస్ బాహుబలితో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాక ప్రధాని మోదీ ఆయనను పిలిచి మరీ అభినందించారు. భీమవరం ప్రాంత రాజుల పలుకుబడి గుర్తించిన ప్రధాని మోదీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని చూస్తున్న బిజెపికి క్షత్రియ సామాజిక వర్గాన్ని ఒక అవకాశంగా చూపించారు అంటారు.

ఏపీలో బలమైన చౌదరి, రెడ్డి, కాపు సామాజిక వర్గాలు పార్టీలపరంగా విడిపోయి ఉన్నాయి. వారిలాగే అర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న క్షత్రియ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు ఆకర్షించే పనిలో కమలనాథులు పావులు కదిపారు. అందుకే భీమవరం రాజులు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్టిస్తే  ఏకంగా ప్రధాని మోదీనే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత 2024 ఎన్నికలు వచ్చేసరికి  కావాలని కూటమిలో పట్టుబట్టి మరీ నర్సాపురం ఎంపీ సీటును సాధించుకున్నారు. అక్కడ నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన  శ్రీనివాస వర్మను పోటీలో నిలబెట్టి గెలిపించి కేంద్రమంత్రిని చేశారు.

ఇప్పుడు బీసీల వంతు

బిజెపికి అగ్రవర్ణాల పార్టీగా ఒక పేరు ఉంది. దాన్ని చెరిపేసుకోవడానికి అన్నట్టు బీసీ సామాజిక వర్గానికి చెందిన పాక సత్యనారాయణను హఠాత్తుగా ఎంపీని చేసింది బిజెపి. విజయసాయి రెడ్డి రాజీనామా చేశాక ఖాళీ అయిన స్థానాన్ని టిడిపి జనసేనతో పోటీ పడి మరీ దక్కించుకున్న బిజెపి పార్టీకి ఎప్పటి నుంచో కట్టుబడి ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పాకా సత్యనారాయణకు ఆ పదవి కట్టబెట్టింది. దీంతో ఒకే పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఎంపీ పదవులు ఇచ్చిన పార్టీగా భీమవరం పరిసర ప్రాంతాల్లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో బిజెపి ఉంది. అలాగే క్షత్రియ బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులకు కీలక పదవులు ఇచ్చామని  ప్రచారం కూడా చేసుకుంటుంది. వీళ్ళు మాత్రమే కాదు కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని మరొక బలమైన సామాజిక వర్గాన్ని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నంలో బిజెపి నేతలు తలమునకులై ఉన్నారు.ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ఒకే పట్టణానికి చెందిన ఇద్దరు నేతలకు ఒకే పార్టీ ఎంపీ సీట్లు ఇవ్వడం ఏపీలో హాట్ టాపిక్ అయింది. మరి ఆ ఇద్దరు కీలక నేతలు భీమవరానికి కేంద్రం నుంచి ఎలాంటి తాయిలాలు సాధించుకు వస్తారో చూడాలి.