Pithapuram Crime News: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కారణంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు మర్డర్ స్కెచ్ వేసింది భార్య. ప్రియునితో కలిసి ప్లాన్ అమలు చేసింది. భర్తను లేపేసి, కనిపించడం లేదని నాటకమాడింది. పిఠాపురం హైవేపై దొరికిన ఓ డెడ్‌బాడీ గురించి కూపీ లాగిన పోలీసులకు ఇన్నాళ్లకు క్లూ దొరికింది. చివరకు భార్య, ఆమె ప్రియుడు అరెస్టు అయ్యారు.
ఫిబ్రవరి 28న పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు 216 జాతీయ రహదారి పక్కనే గుర్తు తెలియని మృతదేహం లభ్యమయ్యింది. ఈ కేసులో మృతదేహం తప్ప ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభ్యం కాలేదు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తు మాత్రం సవాల్‌గా మారింది. చివరకు కేసు దర్యాప్తు కోసం పిఠాపురం సీఐ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేసి మృతదేహం ఎవ్వరిదా అన్న కోణంలో విచారణ చేపట్టారు. రెండు నెలలుగా దర్యాప్తు చేసినా మృతుడు ఎవరు అనేది కనిపెట్టలేని పరిస్థితి తలెత్తింది.
హత్య అని నిర్ధారించి దర్యాప్తు..గుర్తు తెలియని వ్యక్తిని పరీక్షించిన వైద్యులు 30 నుంచి 40 ఏళ్ల వయసు ఉంటుందని తేల్చారు. మృతుడి దుస్తులు, మొలతాడు, చేతి కంకణం మృతదేహం పడి ఉన్న సమీపంలోనే దొరికాయి. మృతుడి ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. రాష్టంలోని అన్ని పోలీసు స్టేషన్లకు మృతదేహం ఫొటోలు పంపించారు. అదే సమయంలో మిస్సింగ్ కేసులపై కూడా ఆరాతీశారు.
పట్టించిన ఎఫ్ఐఆర్..అనకాపల్లి జిల్లా యలమంచిలి పోలీస్ స్టేషన్‌లో ఓ వృద్ధురాలు తన కుమారుడు కొంతకాలంగా కనిపించడం లేదంటూ 4రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీనిని పోలీసుల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. పిఠాపురంలో డెడ్‌బాడీ దర్యాప్తులో ఉన్న పోలీసులు ఆన్‌లైన్‌లో ఎఫ్ఐఆర్ చూసింది. కేసుకు సంబంధించిన పాటో పరిశీలించారు. యలమంచిలి పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ లో ఉన్న మిస్సింగ్ అయిన వ్యక్తి చేబ్రోలు వద్ద జాతీయ రహదారి వద్ద దొరికిన మృతదేహం ఒకటేనని గుర్తించారు. అతని పేరు లోవరాజుగా తేల్చారు. యలమంచిలి వెళ్లి దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం వెలుగు చూసింది.
ప్రియుడితో కలిసి మట్టుబెట్టిన భార్య..లోవరాజు భార్య ప్రియుడీతో కలిసి భర్తను హత్య చేసి అక్కడకు తీసుకవచ్చి పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మృతుడు లోవరాజు కూడా చాలా దొంగతనాల కేసుల్లో నిందితుడు. అతనికే స్కెచ్ వేసి ఖతం చేసిందీ భార్య. అనంతరం పిఠాపురంలో పడేసింది. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు.