Attack on collector in Telangana is creating sensation: ఫార్మా పరిశ్రమల కోసం అవసరమైన భూసేకరణపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిచేందుకు అధికార యంత్రాంగం వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో కానీ కలెక్టర్ పైనే దాడి జరిగింది. ఇతర అధికారుల గురించి చెప్పాల్సిన పని లేదు. నిజంగా ఓ కలెక్టర్‌పై దాడి చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇలా ఎందుకు జరిగిందనేదానిపై ప్రభుత్వం అంతర్గతంగా అయినా విచారణ చేస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసుకోవడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అనుకోవచ్చు. అక్కడ గ్రామస్తులు అంత సీరియస్ గా రియాక్టవ్వాల్సిన పరిస్థితులు కూడా లేవు. గ్రామస్తులే అభిప్రాయసేకరణకు ఆహ్వానించారని కలెక్టర్ చెబుతున్నారు. మరి దాడి చేయాల్సిన అవసరం ఏముంది ?
భూసేకరణలో మొదటి దశనే !
ఫార్మా క్లస్టర్ కోసం భూసేకరణ చేయాలని ప్రభుత్వం అనుకుంది. కొడంగల్ నియోజకవర్గంలో పరిశ్రమలు వచ్చేలా చూడాలని రేవంత్ అనుకున్నారు. అయితే పచ్చని భూముల్లో ఫార్మా పరిశ్రమలు ఎలా పెడతారని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారి అభ్యంతరాలను ప్రభుత్వం వినవలసి ఉంది. సాధారణంగా భూములు ఇవ్వము అని చెబితే బలవంతంగా లాక్కునే పరిస్థితి ప్రస్తుత రాజకీయ వాతావరణంలో లేదు. కేంద్ర చట్టాల ప్రకార.. పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పరిహారం ప్రస్తుత మార్కెట్ విలువ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కారణంగా రైతులు ఎక్కువగా భూసేకరణలో భములు ఇస్తూంటారు. గత ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం కొన్ని వేల ఎకరాలను సేకరించింది. వికారాబాద్‌లో ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభదశలోనే ఉంది.
Also Read: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడి ఘటనల్లేవు !
ఇప్పటి వరకూ ఎన్నో వందల భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేసి ఉంటారు. ప్రజాభిప్రాయసేకరణలు కూడా చేసి ఉంటారు. అనేక సందర్భాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడి ఉంటాయి కానీ అధికారులపై నేరుగా కలెక్టర్‌పై దాడి చేసేంత పరిస్థితి ఎప్పుడూ రాలేదు. భూసేకరణలో భూములు ఇవ్వడం ఇష్టం లేకపోతే కోర్టులకు వెళ్లిన వారు ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ విషయంలో నిర్వాసితులు ఎన్నో ఏళ్లు న్యాయపోరాటం చేశారు కానీ.. కలెక్టర్ పై దాడులు చేయడం వంటి పనులు చేయలేదు. గత ఎన్నికల్లో మెదక్ నుంచి బీఆర్ఎస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకట్రామిరెడ్డి భూనిర్వాసితులకు సరిగ్గా న్యాయం చేయలేదని పలుమార్లు కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
వ్యూహాత్మకంగానే కలెక్టర్ పై దాడి చేశారా ?
కలెక్టర్ పై దాడి ఘటనను ప్రభుత్వం అంత తేలికగా తీసుకునే అవకాశాలు లేవు. పూర్తి స్థాయి విచారణ జరిగే అవకాశం ఉంది. ఆవేశంలో జరిగిన దాడి అయితే ప్రభుత్వం తన విధానాల్లో మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యూహాత్మకంగా చేసి ఉంటే మాత్రం ఆ విషయాన్ని కనిపెట్టేకపోయిన ప్రభుత్వ వ్యవస్థలదే తప్పు అవుతుంది అడ్మినిస్ట్రేషన్ వైఫల్యంగానే భావిస్తారు. తెలంగాణలో ప్రతి చోటా ఏదో ఒకటి జరుగుతున్న సమయంలో.. ఇలాంటి ఘటనల్ని ప్రభుత్వం తేలికగా తీసుకుంటే.. అవి అంతకంతకూ పెరిగే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.