Telangana CM Revanth Reddy | హైదరాబాద్‌: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలిసొచ్చిందని, త్వరలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. ఖైరతాబాద్‌లో ఏఎంవీఐలకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం వల్ల తెలంగాణలో 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగులు జాబ్స్ కోసం కేసులు లెక్కచేయకుండా ఉద్యమ బాట పట్టారు, కానీ కేసీఆర్ హయాంలో వారి ఆకాంక్షలు నెరవేరలేదు. ఆఖరికి కేసీఆర్ ఫ్యామిలీలో నలుగురికి ఉద్యోగాలు పోయాయి. కాంగ్రెస్ పాలనలో నియామక ప్రక్రియ వేగవంతం చేశాం. ఇప్పుడు అసిస్టెంట్​ మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్లు (AMVI) పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని’ పేర్కొన్నారు. 


కేసీఆర్ కు రెండుసార్లు అధికారం ఇచ్చినా నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పది నెలల్లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న ఎల్బీ స్టేడియంలోనే నియామక పత్రాలు అందించి నిరుద్యోగులతో పాటు వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూశాం, అది నాకు అత్యంత సంతోషం కలిగించిందన్నారు. మీ గ్రామంలో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడి.. వారిని పోటీ పరీక్షలకు సిద్ధం చేయ్యాలని AMVI పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ సూచించారు. 



పండుగ రోజు డ్రగ్స్ తీసుకోవడం ఏంటి?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా దీపావళి పండుగ చేసుకుంటుంటే.. కొందరు పండుగ రోజున డ్రగ్స్ తీసుకుని గృహప్రవేశం అని బుకాయించే ప్రయత్నం చేయడం విడ్డూరం. లీడర్ అంటే రోల్ మోడల్ గా నిలవాలి. కానీ పండగ పూట డ్రగ్స్, సారాతో దావత్ చేసుకునే వారు లీడర్లు కాదు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారిని రోల్ మోడల్ గా తీసుకోవాలా, లేక డ్రగ్స్ తీసుకునే వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డి యుతను ప్రశ్నించారు. 


కాలుష్యం నుంచి హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే రవాణా శాఖ సహకారం కావాలి. త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల కోసం త్వరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం. కానీ పది నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారని కేసీఆర్ చెబుతున్నాడు. ఆయన ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోవడం తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయింది ఏమీ లేదన్నారు. ఈ 10 నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో 1 కోటి 5లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసి పథకాలతో లబ్ది పొందారు.



నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలోకి తెచ్చాం. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించారు. ఆడబిడ్డలకు రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ తో 10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్ లభించింది. 35వేల మంది టీచర్లు బదిలీ అయ్యారు. 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నాం. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టాడు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ 1 పోస్టులకు పరీక్షలు నిర్వహించాం. త్వరలో వారికి నియామక పత్రాలు అందిస్తాం’ అన్నారు.