AP Budget 2024-25: ఉద్యోగా ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ఆకలితో ఇబ్బంది పడకూడదని తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లు ప్రజల్లో చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. ఇప్పటి వరకు పట్టణాలు, ప్రధాన నగరాలకే పరిమితమైన ఈ క్యాంటీన్లను ఇకపై గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టింది. 2024-25 సంవత్సరానికి ఐదు నెలల కాలం కోసం బడ్జెట్ తీసుకొచ్చిన ప్రభుత్వం త్వరలోనే గ్రామాల్లో అన్న క్యాంటీన్లు తీసుకొస్తామని చెప్పింది. 


పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఆహారాన్ని అందించేందుకు 123 ప్రాంతాల పరిధిలో 204 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసినట్టు బడ్జెట్ ప్రసంగంలో పయ్యావు కేశవ్ తెలిపారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా 158 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. దీని కోసం బడ్జెట్‌లో ఎంత ఖర్చు పెడుతుందో మాత్రం చెప్పలేదు. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో కూడా క్లారిటీ లేదు. 


2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అప్పట్లో పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. ఐదేళ్ల పాటు విజయవంతంగా వాటిని నడిపించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటిన్లను పట్టించుకోలేదు. దీనిపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ అన్న క్యాంటీన్లు పునరుద్ధరించలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. 



ప్రజలపై ఇంతటి ప్రభావం చూపిన అన్న క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా భరీ ఎత్తున అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పటి వరకు 204 అన్నక్యాంటీన్లు రన్ అవుతున్నాయి. ఇక్కడ రూ.5కే టిఫిన్, రూ.5కే భోజనం అందిస్తున్నారు.  


Also Read: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?


టిఫిన్‌లో ఏం ఇస్తారంటే?


ఐదు రూపాయలకే టిఫిన్ వడ్డిస్తారు. ఇందులో ఇడ్లీ చట్నీ లేదా ఏదైనా పొడి, సాంబార్ ఇస్తారు. ఇడ్లీ వద్దనుకుంటే సోమవారం, గురువారం పూరీ, కుర్మా, మంగళవారం, శుక్రవారం ఉప్మా, చట్నీ, బుధవారం, శనివారం పొంగల్, చట్నీ, మిక్చర్ ఇస్తారు. టిఫిన్‌లో మూడు ఇడ్లీ లేదా పూరి, చట్నీ లేదా 15 గ్రాముల పొడి, 150 గ్రాముల సాంబార్‌, 25 గ్రాముల మిక్చర్ ఇస్తారు.  


భోజనంలో ఏం పెడతారు?


ఆదివారం మినహా సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం పెడతారు. అన్నంతోపాటు కూర, పప్పు లేదా సాంబారు, పెరుగు, పచ్చడి  వడ్డిస్తారు. భోజనం సమయంలో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల పప్పు , 100 గ్రాముల కూర , 15 గ్రాముల పచ్చడి, 75 గ్రాముల పెరుగు వడ్డిస్తారు. ఉదయం 7.30 నుంచి పది గంటల వరకు టిఫిన్ వడ్డిస్తారు. మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 3 వరకు లంచట్‌ వడ్డిస్తారు. రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు డిన్నర్‌ పెడతారు. పుట్టిన రోజు, ఇతర శుభకార్యం సందర్భంగా ఈ అన్న క్యాంటీన్లకు విరాళాలు కూడా ఇవ్వొచ్చు.. 


Also Read: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే