Pawan Kalyan And Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ నెలలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఇన్ని రోజులుగా ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌తో నెట్టుకొచ్చిన సర్కారు ఇప్పుడు ఐదు నెలలకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఐదు నెలలకు 2,94,427.25కోట్లతో బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం ముఖ్యమైన రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. అయితే అన్ని రంగాల కంటే ముఖ్యంగా తొలిసారి మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న శాఖలకు ఎంత కేటాయించారనేది ఆసక్తిగా మారింది. పవన్ కల్యాణ్‌తోపాటు లోకేష్‌కి సంబంధించిన శాఖలకు ఎంత నిధులు ఇచ్చారనేది ట్రెండ్ అవుతోంది. 


ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ శాఖలకు ఇచ్చిన నిధులు


పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడానికి చాలా కార్యక్రమాలు చేపట్టామంది ప్రభుత్వం. అన్ని గ్రామపంచాయితీల క్రియాశీలక భాగస్వామ్యంతో ఉపాధి హామీ పథకం ఆమోదం కోసం ఆగస్టు 23న ఒకే రోజులో 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రపంచ రికార్డు సృష్టించారు. అన్ని గ్రామాలలో సిమెంట్ రహదారులు ప్రారంభించడంతో కార్యాచరణ ప్రణాళిక అమలైంది.  స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల నిర్వహణ ఖర్చుల కోసం చిన్న పంచాయితీలకు 100 రూపాయల నుంచి 10 వేల రూపాయలకు, పెద్ద పంచాయితీలకు 250 రూపాయల నుంచి 25 వేల రూపాయలకు పెంచారు. స్వర్ణ పంచాయితీల కార్యక్రమం క్రింద పంచాయితీల అభివృద్ధికి ప్రభుత్వం దార్శనిక ప్రణాళికను చేపట్టింది. 



2024మార్చి నుంచి పంచాయితీరాజ్ సంస్థలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 998 కోట్లు విడుదల చేశామన్నారు. గ్రామీణ పేదలకు సుస్థిర జీవనోపాధిని అందించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు సృష్టించడానికి ఉపాధి హామీ పథకం కింద 16 శాఖల సమన్వయంతో కార్యక్రమాలు రూపొందిస్తోంది. 2024-25 సంవత్సరంలో ఇప్పటివరకు 1.2 మిలియన్లకుపైగా కుటుంబాలు 100 రోజుల ఉపాధి పొందాయి. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్థల అధికారీకరణ, ప్రధానమంత్రి స్వనిధి పథకం, ప్రధాన మంత్రి విశ్వకర్మ వంటి రాయితీ పథకాలతో జీవనోపాధి మెరుగుపరిచి ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తామన్నారు. స్వయం సహాయక బృంద సభ్యుల ఆదాయాన్ని పెంచుతామన్నారు. 


ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 1,574 పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు 2,134 ఆవాసాలను 2,855 కిలోమీటర్ల రహదారులతో కలుపుతుందని వివరించారు. అదనంగా 164 రహదారులు, వంతెనల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇలా పల్లెలను ప్రగతి పథంలో నడిపేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయించారు. 


లోకేష్ నిర్వహించే శాఖలకు ఇచ్చిన నిధులు


జాతీయ ప్రమాణాలకు దీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. వనం-మనం, ప్రకృతి పిలుస్తోంది, తీర ప్రాంత ఆవాసాల అభివృద్ధికి మడ అడవుల పెంపకం పథకాల ద్వారా స్థిరమైన ఆదాయ కల్పన జరుగుతోందన్నారు. నగర వనాల నిర్వహణ, విస్తరణ ద్వారా వాతావరణ మార్పులు తట్టుకునే నగరాల అభివృద్ధి కోసం  నగరవనం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాలన్నింటికీ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖకు 687 కోట్ల రూపాయల కేటాయించారు. 



నైపుణ్య గణన అనే వినూత్న కాన్సెప్టును తీసుకొచ్చిన నారా లోకేష్‌ విద్య, ఐటీ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో నైపుణ్య గణన చేస్తోంది. శ్రామిక శక్తి,  నైపుణ్యాలు, సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఇదో మార్గంగా భావిస్తోంది ప్రభుత్వం. దీని వల్ల ఉన్న నైపుణ్యాలు తెలుసుకోవడమే కాకుండా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు కూడా తోడ్పాడు అందించనుంది. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాల్లో శిక్ష ఇచ్చేందుకు ఈ కార్యక్రమం రూపకల్పన చేశారు. 


ప్రభుత్వం 192 నైపుణ్య కేంద్రాలు, నైపుణ్య కళాశాలలు, నైపుణ్య విశ్వవిద్యాలయాల ద్వారా మౌలిక వనరులు బలోపేతం చేయబోతోంది. ప్రాధాన్య రంగాల్లో విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ స్కిల్ ఇంటర్నేషనల్ దీని ఉద్దేశం. అందుకే నైపుణ్యాభివృద్ధి శాఖకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1,215 కోట్ల రూపాయలు కేటాయించారు. 


ఎన్నికల్లో భాగంగా కూటమి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు ఇస్తామన్నారు. మధ్యలోనే చదువు మానివేసే పిల్లల సంఖ్య తగ్గించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. 



అంతే కాకుండా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను, ఫలితాలను పెంచే దిశగా కూడా సంస్కరణలు చేపడతామంది ప్రభుత్వం. 16,347 పోస్టులను భర్తీ చేసే దిశగా మెగా డి.ఎస్.సి. ప్రకటించామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ పేర్లతో విద్యా పథకాలు తెచ్చామన్నారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టేందుకు అనవసరమైన యాప్‌లు తొలగించామన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, బ్యాగులు అందిచామని తెలిపారు. అన్నింటికీ కలిపి పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్ల రూపాయలు కేటాయించారు. 


స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా విశ్వవిద్యాలయాల బలోపేతం, ఖాళీల భర్తీ, ఎన్.ఐ.ఆర్.ఎఫ్‌లో టాప్ యూనివర్శిటీలుగా అవతరించడానికి చొరవ తీసుకుంటున్నట్టు తెలిపారు. అమరావతి, తిరుపతి, విశాఖపట్నంలో కనీసం మూడు విజ్ఞాన నగరాలు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు. 


మూడేళ్లలో 18 వేల మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2024 డిసెంబర్ నుంచి 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు వృత్తి శిక్షణ ఇచ్చేందుకు నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్, ఎడ్యుస్కిల్స్, సేల్ఫోర్స్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.  5 వేల నుంచి 15 వేల రూపాయల వరకు వేతనాన్ని అందించే అప్రెంటిస్‌షిప్‌తో కూడిన డిగ్రీ అందించనున్నారు. వీటన్నింటి కోసం ఉన్నత విద్యా శాఖకు 2,326 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. 


Also Read: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే