Villagers Trying To Attack On Vikarabad Collector: వికారాబాద్ జిల్లాలో (Vikarabad District) సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు తిరగబడ్డారు. వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా రైతు కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై (Prteek Jain) చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దుద్యాల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పాటును అక్కడి రైతులు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారికి నచ్చచెప్పేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే దుద్యాల శివారులో సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ వచ్చారు. దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేయగా.. గ్రామస్థులు, రైతులు మాత్రం అక్కడికి రాకుండా లగచర్లలోనే ఉండిపోయారు.



రాళ్లు, కర్రలతో దాడి



ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి బాధిత రైతుల తరఫున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వెళ్లి కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో మాట్లాడారు. రైతులంతా తమ ఊరిలోనే ఉన్నారని.. అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. దీంతో కలెక్టర్, అధికారులు అంగీకరించి అక్కడికి బయల్దేరి వెళ్లారు. అధికారులు గ్రామానికి చేరుకోగానే రైతులు ఒక్కసారిగా వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.


కలెక్టర్, అధికారులు వాహనాలు దిగి రైతులకు నచ్చచెప్పేందుకు యత్నిచినా వారు వినలేదు. కలెక్టర్ డౌన్ డౌన్ నినాదాలతో గ్రామస్థులు మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. కడా ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డికి రాళ్లు తగలడంతో గాయాలయ్యాయి. దీంతో ఆయన పొలాల వెంబడి పరిగెత్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జిల్లా కలెక్టర్, అధికారులు లగచర్లకు వెళ్లే సమయంలో ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.


మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్


ఇందిరాగాంధీ గరీబీ హటావో అని పిలుపునిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని పిలుపునిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. 'రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది. ఆ రాయి సీఎం సొంత జిల్లా వికారాబాద్ రైతన్నల నెత్తిన పడింది. ఆయనపై ఉన్న కోపాన్ని రైతులు జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారు. అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఫార్మా సిటీ కోసం మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్దం చేశారు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చినా దాన్ని పక్కనబెట్టి పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నారు. ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలి, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.' అని డిమాండ్ చేశారు.


Also Read: Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్