Amaravati Lands Dispute : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాజధానిలో అన్ని ప్రాంతాల వారికీ ఇళ్లు ఇచ్చేలా సీఆర్డీఏ చట్టాన్ని మార్చింది. ఇప్పుడు ఈ అంశం రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది. అలాగే న్యాయపరంగా సాధ్యమా అన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి ? అమరావతిలో ఇతరులకు ఇళ్ల స్థలాలివ్వడంలో అభ్యంతరం ఏమిటి ? ఏపీ ప్రభుత్వం మరోసారి కోర్టును ధిక్కరించిందనే విమర్శలు రావడానికి కారణం ఏమిటి ?
రాజధానిలో ఎవరికైనా ఇళ్లు, స్థలాలు ఇచ్చేలా సీఆర్డీఏ చట్ట సవరణ !
సీఆర్‌డీఏ చట్టం- 2014 సెక్షన్ 41(1)లో సవరణను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ప్రకారం ఈ సవరణల ద్వారా సీఆర్డీఏ పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్లు, రైతులు ఇచ్చిన భూములు రాజధాని వెలుపల వారికి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మాస్టర్ ప్లాన్ లో సవరణలు చేయడానికి మరో సవరణ తెచ్చారు. సెక్షన్ 41(4) ప్రకారం అభివృద్ధి ప్రణాళికల గెజిట్‌లో సవరణలు చేసి.. వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవచ్చు. అమరావతికి బయటి ప్రాంతాలవారికి సైతం ఇక్కడ ఇంటి పట్టాలు, ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడానికి వీలుగా సవరణ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
రాజధానికి రైతులు ఇచ్చిన భూములు రాజధాని అవసరాలకే ఉపయోగించాలని సీఆర్డీఏ చట్టం !
సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఎంతోమంది రైతులు ఇచ్చిన భూములకు సీఆర్‌డీఏ సంరక్షకురాలిగా ఉంది. రాజధాని రైతులతో ప్రభుత్వం ఏపీ సీఆర్‌డీఏ-2014 ఒప్పందం చేసుకుంది. దీన్నే చట్టంగా రూపొందించారు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 41(1), 41(3), 2(22), 53(1)ల ద్వారా భూములకు రక్షణ కల్పించింది. రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు మాత్రమే ఇళ్లు కట్టివ్వాలని సీఆర్డీఏ చట్టంలో ఉంది. అమరావతిలో భూములను ఇష్టానుసారం పంచడానికిగానీ అమ్మడానికిగానీ వీలు ఉండదు ప్రస్తుత సీఆర్‌డీఏ చట్టాన్ని మార్చటం ద్వారా అమరావతి రాజధాని భూములను తనకు నచ్చినట్టుగా వినియోగించుకోవటానికి వీలుగా సవరణలు చేపట్టింది.
గతంలోనే పేదలకు కేటాయింపు - కోర్టులో చుక్కెదురు !
రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలోని 500 ఎకరాలను గుంటూరు, విజయవాడలోని ఇంటి పట్టాల పథకం లబ్ధిదారులకు సెంటు స్థలం చొప్పున ఇస్తూ జీవోలను తెచ్చింది. రాజధాని భూములను దాని అవసరాల కోసం కాకుండా ఇతర అవసరాల కోసం ఇవ్వటాన్ని రైతులు తప్పుపడుతూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు కూడా రైతులకు సానుకూలంగా స్పందించింది. ఈ జీవోలు సీఆర్డీఏ చట్టానికి, మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ జీవోలను కొట్టివేసింది. సీఆర్డీఏ చట్టాన్ని కూడా గతంలో ఏపీ ప్రభుత్వం తొలగించింది. కానీ మళ్లీ పునరుద్ధరించింది. ఈ పిటిషన్లపై విచారణలో .. పేదలకు రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్ని పంపిణీ చేసేందుకు అనుమతించాలని కోరుతోంది. ప్రస్తుతానికి విచారణ జరుపుతోంది. అయితే ఈ లోపే సీఆర్డీఏ చట్టానికి ఏపీ ప్రభుత్వం సవరణలు చేయడం వివాదానికి కారణం అయింది.
రైతులిచ్చిన భూములు మినహా ఇతర భూమలిస్తే అభ్యంతరం ఉండదు !
ఏపీ ప్రభుత్వం కేవలం రాజధాని భూసమీకరణలో భాగంగా రైతులు ఇచ్చిన భూముల్ని అదీ కూడా మాస్టర్ ప్లాన్‌లో కీలకమైన నిర్మాణాలకు కేటాయించిన ప్రాంతాన్ని పంచుతామని చెబుతోంది. నిజానికి రైతులు ఇచ్చిన భూములు కాకుండా ప్రభుత్వానికి కూడా భూములున్నాయి. వాటినీ ఇటీవలి కాలంలో వేలం వేస్తోంది. అలా వేయకుండా వాటిని పేదలకు ఇస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు . కానీ చట్టంలో రైతులిచ్చిన భూముల వినియోగంపై స్పష్టమైన కార్యాచరణ ఉండగా వాటిని ఉల్లంఘించేలా వ్యవహరిస్తూండటనే వివాదం వస్తోంది. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.