Srikakulam News: వైసీపీలో మరోనేత తనకు ఇవే చివరి ఎన్నికలని చెప్పేశారు. ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉంటూ వస్తున్న ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్‌ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లోనే తాను రిటైర్ అవుదామని అనుకున్నప్పటికీ జగన్‌, తన కుమారుడి ఒత్తిడితోనే పోటీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 


ఆ అపవాదు వద్దనుకొని బరిలో.. 


ఆదివారం కళింగకోమట్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కుల సంఘాలతో సమావేశం అవుతున్న ధర్మాన ఆదివారం కళింగకోమట్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు... రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోందన్నారు. పార్టీ కోసం పని చేస్తానని జగన్‌కు చెప్పాను. ఈసారి పోటీలో ఉండాలని అంటున్నారు. పార్టీ కష్టకాలంలో వదిలేశానని అపవాదు నాపై రాకూడదుని పోటీ చేస్తున్నట్టు వివరించారు. 


జగన్, కుమారుడి ఒత్తిడితోనే.


గత వారం జగన్‌ను ధర్మాన ప్రసాదరావుతోపాటు ఉత్తరాంద్ర నేతలు కలిశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావును పార్లమెంట్‌ అభ్యర్థిగా ఆయన కుమారుడు రామ్మనోహర్‌ నాయుడిని శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపే ఆలోచన ఉన్నట్టు జగన్ చెప్పారు. తాను పోటీలో ఉండబోనంటూ తన కుమారుడితో జరిగిన సంభాషణ వివరించారు. ఈసారి తాను రెస్టు తీసుకుంటాను నువ్వు పోటీ చేస్తావా అని తన కుమారుడిని అడిగానని.. వద్దు నాన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ తట్టుకోలేను అని చెప్పినట్టు తెలిపారు. నువ్వైతేనే సమర్థుడవని చిన్ని అన్నాడని సీఎంకు వివరించినట్టు పేర్కొన్నారు. సీఎం సూచన మేరకు తాను బరిలో ఉంటానని చెప్పుకొచ్చిన ధర్మాన... ఎవరు పోటీ చేసిన అంతిమంగా గెలిపించాల్సింది ప్రజలే అన్నారు. అందుకే తాను అన్ని కుల సంఘాలతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు వివరించారు. జగన్, తన కుమారుడి ఒత్తిడి తోనే తాను ఈసారి పోటీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 


ఒంటరి పోటీ అంటే భయం..


పొత్తుల రాజకీయాలు, చంద్రబాబునాయుడిపై కూడా ధర్మాన ఘాటు విమర్శలు చేశారు. నాడు పథకాలతో రాష్ట్రం దివాలా తీసిందన్న బాబు, నేడు మరిన్ని పథకాలు ఇస్తానంటూ చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.  ఎప్పటికప్పుడు మాటలు మార్చే వ్యక్తిగా ఆరోపించారు. జగన్ లేడన్నావ్, పని అయిపోయింది అన్నవాళ్లు ఒక్కొక్కరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చివరికి కాంగ్రెస్‌తో చేరి అన్ని పార్టీలు కలిసినప్పటికీ ప్రజాబలం కలిగిన జగన్‌ను ఓడించడం సాధ్యం కాదంటూ హెచ్చరించారు. 


75 ఏళ్లలో సాధ్యంకానిది...


ప్రజల అండదండలు ఉన్నంత వరకూ జగన్ మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని ధర్మాన అభిప్రాయపడ్డారు. మహిళలంతా వైసీపీ వైపే ఉన్నారని, మహిళల మాట వినే మగాళ్లు కూడా ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేస్తారని అన్నారు. 75 ఏళ్లుగా సిక్కోలు సముద్ర తీరంలో ఒక్క పని కూడా చేయలేదని, ఇప్పుడు రూ.నాలుగువేల కోట్లుతో పోర్టు కడుతున్నామన్నారు. మత్స్యకారుల వలసలు నివారించడానికి బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ కడుతున్నామన్నారు. 


ఇదే చివరి అవకాశం


కళింగ వైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు ధర్మానం. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైశ్యుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశానని, చివరిగా మరొక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కళింగ కోమట్లను బీసీల్లో చేర్పించాలని కోరుతూ దాళ్వా సుబ్రహ్మణ్యం కమిషన్‌కు సిఫార్సు చేసింది తానేనని చెప్పారు. ఇప్పుడు బాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, దానిని నమ్మవద్దని చెప్పారు.


చేసిన అభివృద్ధి ఇదే


ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు సాగించుకునేలా అన్ని రకాల పరిస్థితులు కల్పించానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకొకసారి ఎన్నికలలు జరుగుతుంటాయని, శ్రీకాకుళం నియోజకవర్గం పౌరుల ప్రయోజనం కోసం ఏ అవకాశం కలిగినా వినియోగించుకుని జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానన్నారు. 21 ఎకరాల్లో గార్బెజ్ యార్డు ఏర్పాటు చేసి ప్రజలకు చెత్త సమస్య లేకుండా చేశామన్నారు. 2030 వరకూ నగరానికి మంచినీటి ఎద్దడి. లేకుండా చర్యలు చేపట్టానని తెలిపారు. నగరంలో 24 గంటలు మంచినీటిఅవకాశం కల్పించానని వివరించారు. నియోజకవర్గంలో అనేక పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు, కలెక్టరేట్ అభివృద్ధితోపాటు శ్మశానవాటికలను సైతం అభివృద్ధి చేశానని తెలిపారు.


ధైర్యం వచ్చింది


చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన ఎంతటివారైనా ఉపేక్షించనని చెప్పారు. అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వారిని అడ్డుకుంటానని, వైశ్యులను ఎవరు ఇబ్బంది పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు. తనకు చివరిగా మరొక అవకాశం ఇవ్వాలని నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని ధర్మాన కోరారు. ఇటీవల కళింగకోమట్లు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలతో తనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగిందని చెప్పారు. తనవిజయానికి ఇదే కీలక మలుపుగా అభివర్ణించారు.