AP Elections 2024: సినిమా చూపిస్త మామా.. అనేది ఇప్పుడు పార్టీల నినాదంగా మారింది. ఎన్నికల(Elections) నేపథ్యంలో ఒకపార్టీపై మరో పార్టీ పైచేయి సాధించేందుకు సినిమాల(Cinema) బాట పట్టాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ(YSRCP), టీడీపీ(TDP)ల మధ్య ఇప్పుడు సినిమా రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలకు సమయం పెద్దగా లేకపోవడం, గెలుపు గుర్రం ఎక్కాలన్న ఆకాంక్ష ఎక్కువగా ఉండడంతో కీలకమైన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ -.జనసేన పొత్తు(బీజేపీ కలిసే అవకాశం ఉంది) ఒకవైపు, వైసీపీ ఒంటరిగా మరోవైపు.. ఎన్నికలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
సినిమాలతో గెలుపు గుర్రాలు..
ఈ క్రమంలో సభలు, సమావేశాలు జోరుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ సిద్ధం(Sidhdham) సభలు పెడుతుండగా.. టీడీపీ ఆధ్వర్యంలో రా.. కదలిరా!(Raa.. kadaliraa) సభలు ఇటీవలే ముగిశాయి. అయినా.. చంద్రబాబు(Chandrababu) రోడ్ షోలకు రెడీ అవుతున్నారు. మరోవైపు.. పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్(Nara lokesh) శంఖారావం(Shankaravam) సభలు నిర్వహిస్తున్నారు. ఇలా.. ఒక పార్టీపై మరో పార్టీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అయితే.. మరోవైపు, సినిమాలతోనూ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు కొట్టేందుకు రెడీ కావడం గమనార్హం.
రాజధాని వర్సెస్ అమ్మ ఒడి!
ఇరు పార్టీలకు చెందిన కీలక అంశాలతో షార్ట్ మూవీలను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ట్రైలర్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. టీడీపీ అనుకూల వర్గాల నుంచి ఒక సినిమా ట్రైలర్ బయటకు వచ్చి.. దుమ్ము రేపుతోంది. ఇక, ఇప్పుడు వైసీపీ కి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చేసింది. టీడీపీ అనుకూల వర్గాల నుంచి వచ్చిన సినిమా.. `రాజధాని`(Rajadhani). ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం.. రైతులు తమ భూములు ఇవ్వడం, చంద్రబాబు హయాంలో నిర్మాణాలు జరగడం, నవనగరాల ఏర్పాటు వంటి కీలక అంశాలను చూపించారు. అంతేకాదు.. వైసీపీ అధికారంలోకి రాగానే.. మూడు రాజధానులను తెరమీదికి తెచ్చి.. ఏవిధంగా ఇక్కడి రైతులను ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని చూపించారు.
ఈ క్రమంలో పోలీసుల దాడులు, లాఠీ చార్జి వంటి అంశాలను, పాదయాత్రలను కూడా ప్రధానంగా ప్రస్తా వించి.. ఎన్నికల ముందు రాజధాని అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చింది. అప్పుడెప్పుడో విడుదలైన జ్యోతిక నటించిన సినిమా ట్రైలర్‌కు డబ్బింగ్ చెప్పి `అమ్మ ఒడి`(Ammavodi) పేరుతో జనాల్లోకి వదిలారు.
బాలయ్య మూవీ కూడా!
ఇక, ఇప్పటికే వైసీపీ తరఫున సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ramgopal varma) రూపొందించిన `వ్యూహం` పూర్తి సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే.. న్యాయపరమైన సమస్యలతో కోర్టులో ఉంది. దీనికి జోడింపుగా.. పార్ట్ 2 కూడా తీస్తున్నారు. దీనిని ఈ నెల లేదావచ్చే నెల ప్రారంభంలో విడుదల చేయనున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రతో రూపొందించిన `యాత్ర-2` విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్సే వస్తోంది. మరోవైపు.. నారా రోహిత్ నటించిన ప్రతినిధి2 కూాడా విడుదలకు సిద్ధంగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య నటిస్తున్న నరసింహ నాయుడు సినిమా నేరుగా రాజకీయాలకు సంబంధించి కాకపోయినా.. ఏపీ రాజకీయాలను వేడెక్కించేదిగానే ఉండనుందని సినీ వర్గాలు భావిస్తున్నారు. మొత్తానికి సినిమాలతో వైసీపీ, టీడీపీలు విజృంభించడం చూస్తే..ఎన్నికల జోరు ఎలా ఉంటుందో అర్థమవుతోంది!!.