KCR did not attend the assembly : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. విపక్ష నాయకుని హోదాలో తొలిసారిగా శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ  బడ్జెట్ ప్రసంగానికి  కూడా ఆయన  దూరంగా ఉన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ, శాసన మండలి వాయాదా పడ్డాయి. సోమవారం కీలకమైన నీటి ప్రాజెక్టుల అంశంపై చర్చ జరగనుంది. ఆ రోజున కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్నది స్పష్టత లేదు. పదమూడో తేదీన నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ ఏర్పాటు చేసింది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని బీఆర్ఎస్ రాష్ట్రంపై పోరాటం ప్రారంభించింది. రేవంత్ రెడ్డి తాము ఎలాంటి ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించలేదని..బీఆర్ఎస్ హయాంలోనే కొన్ని ప్రాజెక్టులు ఇచ్చారని చెబుతోంది.  బీఆర్ఎస్ రాజకీయ. పోరాటానికి కౌంటర్ గా.. మేడిగడ్డ వద్దకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లి ..  ప్రాజెక్టులో అవినీతి, బ్యారేజీ కుంగిపోవడం వంటి అంశాలను వివరించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  


కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో  సీఎం రేవంత్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో  విమర్శలు గుప్పించారు.  ప్రతిపక్ష నేత హోదాలో ఉండి బీఏసీ సమావేశానికీ వెళ్లలేదు.  తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవడం అసెంబ్లీని అవమానించడమేనన్న విమర్శలను కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశానికి వెళ్లిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి ఎందుకు రాలేదని అధికార పక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.                                       


బీఆర్ఎస్ మీటింగ్ కు వెళ్లినప్పుడు సహకరించిన ఆరోగ్యం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడానికి సహకరించదా..? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.  నిజానికి బీఏసీ సమావేశానికి కేసీఆర్, కడియం శ్రీహరి హాజరవుతారని ఆ పార్టీ నేతలు పేర్లు ఇచ్చారు. దీంతో ఆయన హాజరవుతారని అనుకున్నారు. కానీ  సమావేశానికి మాత్రం ఆయన స్థానంలో హరీశ్ రావు వెళ్లారు. నిబంధనల ప్రకారం ముందు పేర్లిచ్చిన వారే రావాలని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమివ్వగానే ఆయన వెనుదిరిగారు. కావాలనే కేసీఆర్ బదులు హరీశ్ ను పంపారని విమర్శలు  వచ్చాయి.  మరోవైపు ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో కేటాయించిన చాంబర్ పై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.  ప్రతిపక్ష నాయకుడి హోదాలో సభకు హాజరై ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇష్టారీతిలో వ్యవహరించడం సరికాదని  అధికార పక్ష నేతలు  ఆయన తీరును  తప్పు పడుతున్నారు.                


అయితే కేసీఆర్ సరైన సమయంలో సభకు వస్తారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే అంశంపై చర్చ పెడితే కేసీఆర్ వచ్చి  బీఆర్ఎస్ తరపున ప్రభుత్వ తీరును ఎండగడతారని  చెబుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగానికి హాజరవుతారని అనుకున్నా రాలేదు. పదమూడో తేదీన సభ ఉన్నందున ఎలాగూ హాజరు కారు.. మరి సోమవారం హాజరవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.