Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని ఈ మధ్యే వారణాసి కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై హిందువులు స్వాగతించగా...కొందరు ముస్లింలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్‌కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత సిద్ధిఖుల్లా చౌదురి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి వార్నింగ్ ఇచ్చారు. ఆయన బెంగాల్‌కి వస్తే చుట్టుముడతామని హెచ్చరించారు. వెంటనే హిందువులంతా జ్ఞానవాపి మసీదు నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోల్‌కత్తాలోని ఓ ర్యాలీలో పాల్గొన్న సిద్దిఖుల్లా ఈ కామెంట్స్ చేశారు. మసీదులో వెంటనే పూజలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అయినా మసీదులో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి మతి ఉందా అంటూ మండి పడ్డారు. 


"యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బెంగాల్‌కి వస్తే చుట్టుముడతాం. అయినా మసీదులో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇలా ఇస్తారు. యోగికి మతి ఉందా..? ఆయన బెంగాల్‌కి వస్తే మళ్లీ ఇక్కడి నుంచి బయటకు వెళ్లారు. హిందువులు జ్ఞానవాపి మసీదు నుంచి బయటకు వెళ్లిపోవడం మంచిది. కావాలనే అక్కడ పూజలు చేస్తున్నారు. మేం ఎప్పుడూ ఆలయానికి వెళ్లి పూజలు చేయలేదు"


- సిద్దిఖుల్లా చౌదురి, తృణమూల్ కాంగ్రెస్ నేత 


తాము ఆలయాలకు వెళ్లి ప్రార్థించనప్పుడు హిందువులు మాత్రం మసీదులోకి వచ్చి ఎలా పూజలు చేస్తారని ప్రశ్నించారు సిద్దిఖుల్లా. మసీదు మసీదే అని దాన్ని ఆలయంగా మార్చాలని చూస్తే ఊరికే కూర్చుని చూడమని వార్నింగ్ ఇచ్చారు. 800 ఏళ్లుగా ఉన్న మసీదుని కూల్చేస్తారా అని ప్రశ్నించారు. జనవరి 31న వారణాసి కోర్టు హిందువుల పూజలకు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ రెండు రోజుల కిందట Gyanvapi Masjid committee కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ వేసిన క్రమంలోనే సిద్దిఖుల్లా ఈ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. 


ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి (Gyanvapi) కాంప్లెక్స్ బేస్ మెంట్ లో దాదాపు 30 ఏళ్ల తర్వాత తిరిగి పూజలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనా మందిరంలోని భూగర్భ గృహంలో హిందువుల దేవతా విగ్రహాలకు  పూజలు చేశారు. జ్ఞానవాపి వివాదంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఇచ్చిన రిపోర్టు  (ASI Survey Report) జనవరి 25న విడుదలైంది. ప్రస్తుతం ఉన్న మసీదు స్థానంలో గతంలో ఆలయం ఉన్నట్లుగా ఏఎస్ఐ అధికారులు గుర్తించారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదును కట్టారని పురావస్తు శాఖ తేల్చింది.ఆ మసీదు కింద ఓ నిర్మాణం ఉన్నట్లుగా గుర్తించారు. హిందూ ఆలయంలోని కొన్ని స్తంభాలను చెక్కి మసీదు నిర్మాణంలో వాడినట్లుగా గుర్తించారు. జ్ఞానవాపి మసీదు కింది భాగంలో కొన్ని దేవతల విగ్రహాలు ఉన్నట్లుగా కూడా పురావస్తు నిపుణులు నివేదికలో పేర్కొన్నారు. ఈ రిపోర్టును ఏఎస్ఐ అధికారులు ఈ కేసులో ఇరు పక్షాలకు కాపీలను అందించారు. హిందూ తరఫు న్యాయవాది విష్ణు జైన్ ఏఎస్ఐ నివేదికలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. 


Also Read: Indian Killed in US: అమెరికాలో మరో భారతీయుడిపై దాడి, తీవ్ర గాయాలతో మృతి