Indian Killed in Washington: అమెరికాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవలే ఓ ఘటన వెలుగులోకి రాగా..ఇప్పుడు మరొకరు హత్యకు గురయ్యారు. ఫిబ్రవరి 2వ తేదీన తెల్లవారుజామున ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లిన వివేక్ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బయటకు వచ్చాడు. ఆ సమయంలోనే ఓ వ్యక్తికి వాగ్వాదం జరిగింది. ఎందుకు అన్నది మాత్రం కారణం తెలియలేదు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి వివేక్‌పై దాడి చేశాడు. తలపై గట్టిగా కొట్టడం వల్ల తీవ్ర గాయాలతో వివేక్‌ రోడ్డుపైనే పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని పోలీసులు గుర్తించి హాస్పిటల్‌కు తరలించారు. దాదాపు ఐదు రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ప్రాణం దక్కలేదు. తీవ్ర గాయాలతో ఫిబ్రవరి7వ తేదీన మృతి చెందాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..వివేక్ చందర్ వర్జీనియాలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. అయితే...ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని CCTV ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఓ వ్యక్తిని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు. అనుమానితుడి ఫొటో విడుదల చేశారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తమకు చెప్పాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారికి 25 వేల డాలర్ల నజరానా ఇస్తామని ప్రకటించారు. 


 అమెరికాలోని చికాగోలో భారతీయ విద్యార్థిపై దొంగలు దారుణంగా దాడి చేశారు. సాయం కోసం గట్టిగా అర్థిస్తూ రోడ్డుపై బాధితుడు పరిగెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రక్తస్రావం అవుతున్నా దొంగల దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని బాధితుడు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైన సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధితుడి పేరు సయ్యద్ మజహిర్ అలీ. దొంగలు దాడి చేయడం వల్ల నోరు, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడి భార్య భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కి లేఖ రాసింది. వైద్యం అందించాలని విజ్ఞప్తి చేసింది. 


"చికాగోలో ఉన్న నా భర్త ప్రాణాలకు భద్రత లేదనిపిస్తోంది. ఈ విషయంలో చాలా ఆందోళనగా ఉంది. దయచేసి ఆయనకు సరైన వైద్యం అందించండి. వీలైతే నేనూ అమెరికాకి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయండి. నా పిల్లలతో సహా నా భర్త దగ్గరికి వెళ్లేలా అనుమతించండి"


- బాధితుడి భార్య