సాధారణంగా మనం ఎవరినైనా ఇష్టపడితే మన నుంచి వెళ్లే  మొదటి  గిఫ్ట్ గులాబీ పువ్వు. తెలియని వాళ్లు కానీ తెలిసిన వాళ్లు రోజ్ ఇస్తే.. మనల్ని ప్రేమిస్తున్నారా..? ఎందుకు రోజ్ ఇచ్చారనే సందేహం రాకుండా ఉండదు. ఫిబ్రవరిని  ప్రేమికుల నెలగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ నెలలో వాలెంటైన్స్ డే వారాన్ని కొంతమంది సంతోషంగా  జరుపుకుంటారు, మరికొందరికి కష్టంగా ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా  వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలయ్యింది. ఈ వారం రోజ్ డేతో మొదలై వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. ఈ వారంలోని ప్రతి రోజుకి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది రోజ్ డే, వాలెంటైన్స్ డే వారంలో మొదటి రోజు, ముఖ్యంగా ముఖ్యమైనది. ఆ రోజున, ప్రేమికులు  వారి లవర్ కు గులాబీలను ఇచ్చి  ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. అయితే, ఈ  వాలెంటైన్స్ వీక్ లో ఇచ్చే  ప్రతి గులాబీ పువ్వుకి  ఒక్కొ ప్రాముఖ్యత ఉంటుంది. అదేంటో ఇక్కడ  ఇప్పుడు తెలుసుకుందాం.


గులాబీ పువ్వు రంగుల ప్రాముఖ్యత:


రెడ్ రోజ్ : ఈ వాలెంటైన్స్ వీక్, ఎర్ర గులాబీని ఇతరులపై మనకున్న ప్రేమను వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారు. ఒక రకంగా ఆలోచిస్తే.. ప్రేమ  భాషలో, ఎరుపు గులాబీని ఇస్తే..  "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అనే అర్థం వస్తుంది. కాబట్టి, మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే, ఎర్ర గులాబీని ఇవ్వండి. ఆ తర్వాత వారికే సీన్ మొత్తం అర్ధమవుతుంది. 


పింక్ రోజ్: పింక్ రోజ్ చాలా మందికి తెలీదు. ఇది మీరు ఒక  అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ ఇస్తే, నిజమైన స్నేహానికి ధన్యవాదాలు తెలుపుతున్నారని అర్థం. కాబట్టి మీకు నిజమైన స్నేహితుడు ఉన్నట్లయితే, వాలెంటైన్స్ వారంలో వారికి గులాబీ బహుమతిగా ఇవ్వడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ మధ్య ఉన్న స్నేహ బంధం కూడా బలపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు ఎవరినైనా అభినందించాలనుకుంటే పింక్ రోజ్ ఇచ్చి మీ మనసులో ఉన్నది చెప్పండి. 


పర్పుల్ గులాబీ:  ప్రేమ భాషలో, పర్పుల్ గులాబీకి  ప్రత్యేకత ఉంది. ఈ వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా ఈ రంగు గులాబీలను ఇవ్వడం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన స్నేహం ఏర్పడుతుందని అర్థం. ఇంకా చెప్పాలంటే.. ఇది నిజమైన స్నేహానికి  గుర్తింపుని కూడా సూచిస్తుంది. 


ఎల్లో కలర్ రోజ్: పసుపు గులాబీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్లో కలర్ రోజ్  ఇద్దరి మధ్య స్నేహాన్ని సూచిస్తుంది. ప్రేమలోనే కాదు స్నేహంలో కూడా ప్రేమ, ఇష్టం, అభిమానం ఉంటుంది. మీకు బాగా ఇష్టమైన వారికీ పసుపు గులాబీ ఇచ్చి నీతో స్నేహం ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పండి. 


వైట్ రోజ్: తెల్ల గులాబీని చాలా సందర్భాల్లో ఉపయోగిస్తారు. మీరు ఎవరైనా వివాహం చేసుకునే ముందు వారికి ఇవ్వడానికి కూడా తెల్ల గులాబీని ఎంచుకుంటారు. అంతేకాకుండా ఇది స్వచ్ఛమైన ప్రేమని ఎదుటి వారికీ తెలియబరుస్తుంది. ప్రేమికుల వారంలో ఈ తెల్ల గులాబీలు ఎక్కువ మంది ఇస్తుంటారు.