AP Elections 2024 Ganta Srinivasa Rao wants to contest from Bheemili: అమరావతి: టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా బావుందని, ఎక్కడో ఓ చోట చిన్న అలజడి సహజమేనన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. కొందరు గంటా టీడీపీని వీడి వైసీపీలో చేరతారని ప్రచారం చేశారు. తొలి జాబితా విడుదల కావడంతో గంటా శ్రీనివాసరావు, చంద్రబాబుతో కీలక భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే ఉందని, చీపురుపల్లి నుంచి తన పోటీపై చర్చించినట్లు గంటా తెలిపారు. 


మంత్రి బొత్స సత్యనారాయణపై గంటా పోటీ?
చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉంటారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గంటాను బరిలో నిలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. భేటీలోనూ చంద్రబాబు ఇదే విషయం చెప్పారని, ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తావని చంద్రబాబు తనతో అన్నట్లు గంటా చెప్పుకొచ్చారు. అయితే తాను విశాఖ జిల్లాలోనే ఉండాలనుకుంటున్నట్లు.. భీమిలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చంద్రబాబుకు గంటా వివరించారు. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై చర్చించేందుకు చంద్రబాబు పిలుస్తానని గంటా శ్రీనివాసరావుకు చెప్పారు. 



చీపురుపల్లి నుంచే పోటీ అని బలవంతం పెట్టారా?
చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని బలవంతం చేస్తున్నారన్న వ్యాఖ్యలపై సైతం గంటా స్పందించారు. అలాంటిదేమీ లేదని, చీపురుపల్లి నుంచి పోటీ చేసినా, భీమిలి నుంచి బరిలోకి దిగినా తన గెలుపు ఖాయమని చంద్రబాబు ధీమాగా ఉన్నారని తెలిపారు. కానీ చీపురుపల్లి నుంచే బరిలోకి దిగుతావా అని చంద్రబాబు అడిగినట్లు స్పష్టం చేశారు. లేదు కచ్చితంగా భీమిలి అనేదే ఉద్దేశమైతే మరోసారి పిలిచినప్పుడు అభిప్రాయం చెప్పాలన్నారు. చీపురుపల్లి నుంచే గంటా పోటీ చేస్తారని ప్రచారం జరగడంతో మంచి రెస్పాన్స్ వచ్చిందని చంద్రబాబు చెప్పినట్లు తెలిపారు.


చంద్రబాబును కొన్ని రోజుల తరువాత ఇప్పుడే కలిశానని, కానీ మేం భేటీ అవ్వకుముందే తిట్టుకున్నామంటూ వదంతులు ప్రచారం జరిగిందన్నారు. ఈ దుష్ప్రచారంపై లీగల్ నోటీసులు పంపాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. తొలి జాబితాలో సీనియర్ల పేరు లేకపోవడంతో పార్టీలో ఏ అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ఉదాహరణకు తన పేరు తొలి జాబితాలో లేకున్నా.. పలానా చోట నువ్వు పోటీ చేస్తేనే బాగుంటుందని పార్టీ భావించినట్లు పేర్కొన్నారు. ప్రాముఖ్యత ఇవ్వడంతోనే కొన్ని ముఖ్యమైన చోట పోటీ చేస్తారా అని చంద్రబాబు అడిగారని.. పొత్తు ధర్మం ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. 


ఒకటేసారి 175 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం లేదని, వైసీపీ 7 జాబితాలు విడుదల చేసినా కేవలం 70 మంది పేర్లను ప్రకటించిందన్నారు గంటా. అందులోనూ అవి అభ్యర్థుల జాబితాలు కాదని, ఎవరినైనా తొలగించే ఛాన్స్ ఉందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి, తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. జనసేన, టీడీపీకి ఎన్ని సీట్లు అనేది రెండు పార్టీల అధినేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, తలకిందుల తపస్సు చేసినా, కాపులు మాత్రమే కాదు అన్ని వర్గాల వారు వైసీపీకి దూరమయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మునిగిపోయే నావ అని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఘన విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.