Minister Botcha comments on TDP-Janasena: రాష్ట్రంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ (AP Elections)కు సంబంధించి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ(TDP)-జ‌న‌సేన(Janasena) పార్టీలు పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. మొత్తం 175 సీట్ల‌కు గాను 118 స్థానాల్లో ఈ రెండు పార్టీలు.. తొలి విడ‌త(1st list) జాబితా ప్ర‌క‌టించాయి. టీడీపీ 94 సీట్ల‌లోనూ, జ‌న‌సేన 24 సీట్ల‌లోనూ పోటీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు చెప్పాయి. వీటిలోనూ టీడీపీ 94 అసెంబ్లీ సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది.


జ‌న‌సేన కేవ‌లం ఐదుగురు అభ్య‌ర్థుల‌ను మాత్ర‌మే ప్ర‌క‌టించింది. మిగిలిన వారిని త్వర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని కూడా ఈ రెండు పార్టీల అధ్య‌క్షులు ప్ర‌క‌టించారు. ఇక‌, ఈ జాబితాలపై ఆయా పార్టీల్లో అసంతృప్తులు తెర‌మీద‌కు వ‌చ్చాయి. మ‌రోవైపు బుజ్జ‌గింపు కార్య‌క్ర‌మాలు కూడా పుంజుకున్నాయి. కీల‌క నేత‌ల‌తో ముఖ్యంగా టికెట్ ఆశించి ద‌క్క‌ని వారితో టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు(Ex CM  Chnadrababu) చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. కొందరు నేతల్ని బుజ్జ‌గిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ప‌ద‌వులు ఇస్తామ‌ని హామీ ఇచ్చి సముదాయిస్తున్నారు. 


వైసీపీ కామెంట్స్‌.. 


ఒక‌వైపు.. టీడీపీ-జ‌న‌సేన‌లు త‌మ త‌మ పార్టీల అభ్య‌ర్థుల‌ను బుజ్జ‌గిస్తుండ‌గా.. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)కి చెందిన నాయ‌కులు, ప్ర‌భుత్వంలోని మంత్రులు టీడీపీ-జ‌న‌సేన జాబితాపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. స‌మాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస‌ వేణుగోపాల కృష్ణ‌, విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌(Botcha Satyanarayana)లు ఈ జాబితాపై తాజాగా ఆదివారం రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రంలో మంత్రి బొత్స  స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. టీడీపీ-జ‌న‌సేన‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రెండు పార్టీల‌కూ ఎజెండా లేద‌న్నారు. ``టీడీపీ-జనసేన పొత్తులపై సీట్ల లెక్కలు పక్కన పెడితే చివరికి ఎన్నికల ఫలితాలు మాత్రం మాకే అనుకూలంగా ఉంటాయి`` అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. 



వారికి వ్యూహం లేదు!


టీడీపీ-జ‌న‌సేన పార్టీల‌కు ఒక వ్యూహం అంటూ లేద‌ని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. పొత్తులతో చేతులు క‌లిపిన టీడీపీ-జనసేన పార్టీలకు సరైన ఎజెండా లేదని దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ పాల‌న‌లో రాష్ట్రంలో జ‌రిగిన సంక్షేమం, ప్ర‌తి కుటుంబానికి చేసిన మేలు, అందించిన ప‌థ‌కాల‌ను చూపించి ఓటు వేయాల‌ని అడుగుతున్నామ‌ని, ఇదే త‌మ నాయ‌కుడు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అజెండా అని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇక‌, పొత్తులపై త్వ‌ర‌లోనే ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌ను క‌లుస్తారంటూ.. టీడీపీ అదినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందిస్తూ..  పవన్ కళ్యాణ్, చంద్రబాబులు, అమిత్ షాను కలిసినా.. అమితాబచ్చన్ కలిసినా.. వైసీపీకి పోయేదేమీ లేద‌ని బొత్స త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. వైసీపీ అన్ని ఎన్నిక‌ల్లోనూ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని తెలిపారు. ప్ర‌జాద‌ర‌ణ‌తో గెలిచి తీరుతామ‌ని వ్యాఖ్యానించారు.       


మంత్రి చెల్లుబోయిన ఏమ‌న్నారంటే.. 


 టీడీపీ- జనసేన పొత్తులో టిక్కెట్ల కేటాయింపుపై రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని ఆరోపించారు. టిక్కెట్ల ప్రకటనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని చంద్రబాబు తీవ్రంగా అవమానపరిచారని, పవన్‌ను అవమనించడమంటే కాపు సామాజిక వర్గాన్ని తీవ్రంగా అవమానించినట్లేనని అన్నారు. ``కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని అత్యాశతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను అవమాన పరుస్తున్నారు. పవన్‌కు కుడిప‌క్క‌న నాదెండ్ల మ‌నోమ‌ర్‌, ఎడ‌మ‌ప‌క్క‌న కందుల దుర్గేష్  ఉండేవారు. కందుల దుర్గేష్‌కే టిక్కెట్ లేకపోతె ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.. పవన్ కళ్యాణ్ పావలా పాటి విలువ‌ కూడా చేయడనే అవమానం జరిగింది. చంద్రబాబు 94 సీట్లు ప్రకటించుకుంటే పవన్ ఐదు సీట్లు కూడా ప్రకటించుకోలేకపోయారు. ఇప్పటికే టీడీపీకి రాజ్యసభలో సున్న, రేపు పార్లమెంట్లోనూ అసెంబ్లీలో కూడా సున్నానే మిగులుతుంది`` అని చెల్లుబోయిన వ్యాఖ్యానించారు.