AP Assembly elections 2024: శ్రీకాకుళం (Srikakulam)జిల్లాలో పది స్థానాలు ఉంటే... టీడీపీ (Tdp) నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టెక్కలి (Tekkali) నియోజకవర్గం నుంచి టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్సీ.. దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో తొలిసారి హరిశ్చంద్రాపురం గెలుపొందిన అచ్చెన్నాయుడు...1999, 2004లో వరుసగా మూడు సార్లు గెలుపొంది....హ్యాట్రిక్‌ కొట్టారు.


కింజరాపు కుటుంబానిదే ఆధిపత్యం 
హరిశ్చంద్రాపురం నియోజకవర్గం మనుగడలో ఉన్నంత కాలం... కింజరాపు కుటుంబమే ఆధిపత్యం చలాయించింది. 1983 నుంచి 1994 వరకు కింజరాపు ఎర్రన్నాయుడు తిరుగులేని విజయాలు సాధించారు. ఆయన పార్లమెంట్‌కు ఎన్నికవడంతో ఆయన స్థానంలో పోటీ చేసిన అచ్చెన్నాయుడు హ్యాట్రిక్‌ విజయాలు అందుకున్నారు. హరిశ్చంద్రాపురం నియోజకవర్గం రద్దవడంతో...2009లో టెక్కలి నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కొర్ల రేవతిపతి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలుపొందారు అచ్చెన్నాయుడు. 2014లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగోసారి టెక్కలి నుంచి పోటీ చేస్తున్నారు అచ్చెన్నాయుడు


మూడోసారి మామ, అల్లుళ్లు 
ఆమదాలవలస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున కూన రవికుమార్‌ పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూన రవికుమార్‌ తొలిసారి పోటీ చేసి...వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాంపై గెలుపొందారు. 2019ఎన్నికల్లో ఓటమి పాలయిన రవికుమార్...2024లోనూ టిడీపీ టికెట్‌ దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గానికి పది సార్లు ఎన్నికలు జరిగితే...ఐదుసార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్‌, ఒకసారి వైసీపీ విజయం సాధించింది. 1983, 1985, 1994, 1999లో తమ్మినేని సీతారాం...టీడీపీ తరపున నాలుగు సార్లు గెలుపొందగా, ఒకసారి వైసీపీ తరపున విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. న్యాయశాఖ, స్పోర్ట్స్‌, స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, ఎక్సైజ్‌ అండ్‌ మున్సిపల్‌ వ్యవహారాల శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఆముదాలవలసలో ఐదుసార్లు గెలుపొందారు తమ్మినేని సీతారాం. 


బెందాళం హ్యాట్రిక్ కొడతారా ?
ఇచ్చాపురం సిట్టింగ్ సీటును...ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కుమార్‌కు కేటాయించింది. బెందాళం అశోక్‌కుమార్‌...2014, 2019  ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు. ఆయనకు పోటీగా వైసీపీ తరపున శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్‌, పిరియా విజయ బరిలోకి దిగుతున్నారు. ఆమె భర్త పిరియా సాయిరాజ్‌...2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి 2004 మినహా తెలుగుదేశం పార్టీకి ఓటమి అన్నది లేదు. 2014 ఎన్నికల్లో పిరియా సాయిరాజ్ ఓటమి పాలవడంతో...ఆయనకు భార్యకు టికెట్‌ ఇచ్చింది వైసీపీ. 


రాజాంలో మాజీ మంత్రి కోండ్రుకు టీడీపీ టికెట్
రిజర్వర్డ్‌ అసెంబ్లీ అయిన రాజాం నియోజకవర్గంలో...మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్‌కు తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించింది. కోండ్రు మురళీ మోహన్‌...2009 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి...కంబాల జోగులు చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ తరపున కంబాల జోగులు...2014లోనూ పోటీ చేసి...కావలి ప్రతిభా భారతిపై 512 ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గానికి 11 సార్లు ఎన్నికలు జరిగితే...ఐదు సార్లు కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుపొందారు.