Raghurama Vs Bharat : పార్లమెంట్‌లో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ అన్నట్లుగా వాగ్వాదం జరిగింది. పార్టీకి  రెబల్‌గా మారిన రఘురామకృష్ణరాజు లోక్‌సభలో ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు. ఏపీలో కార్పొరేషన్ల పేరుతో రుణాల సేకరణ అంశాన్ని ఆయన ప్రస్తావించారు.  జగన్ సర్కార్ కార్పోరేషన్ల పేరుతో రుణాలు తీసుకోవడంతో పాటు ఆ నిధుల్ని కూడా ఇతరత్రా అవసరాల కోసం మళ్లిస్తోందని రఘురామ ఆరోపించారు. తాజాగా ఏపీ బేవరెజేస్ కార్పోరేషన్ పేరుతో అప్పులు తీసుకోవడం, వాటిని మూలనిధికి జమ చేయకపోవడాన్ని రఘురామ తప్పుబట్టారు.  కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొని నిధులను మళ్లిస్తున్నారని రఘురామ ఆరోపించారు. బేవరేజెస్ కార్పొరేషన్ పేరుతో రుణాలు తీసుకుంటున్నారని, ఏపీ మూలనిధికి నిధులను జమ చేయడం లేదని ఆరోపించారు.


సీఎం ధైర్యం చెప్పినా కదలడం లేదు - వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు భయం ఎందుకు ?


రఘురామ ప్రసంగిస్తున్న సమయంలో  వైఎస్ఆర్‌సీపీ  ఎంపీలు  అడ్డుకున్నారు.  మార్గాని భరత్ , వంగ గీతతో పాటు పలువురు ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడకుండా అడ్డుకున్నారు.ఏపీ ప్రభుత్వంపై తాను చేస్తున్న వ్యాఖ్యలకు అన్ని ఆధారాలు ఉన్నాయని  రఘురామ స్పష్టం చేశారు.  పీ ప్రభుత్వం కార్పోరేషన్ల పేరుతో రుణాలు తీసుకునేందుకు ప్రత్యేక జీవోను కూడా తెచ్చిందని అన్నారు. ఈ క్రమంలో రఘురామ ప్రసంగాన్ని వైసీపీ ఎంపీలు పదే పదే అడ్డుకున్నారు. దీంతో సహనాన్ని కోల్పోయిన రఘురామ... సిట్ డౌన్ అంటూ వైసీపీ ఎంపీలపై అరిచారు. తమను కూర్చోమని చెప్పడానికి రఘురామ ఎవరంటూ  వైసీపీ ఎంపీలు వివాదానికి దిగారు.


ఏపీ వద్దు తెలంగాణలో కలిపేయండి - తీర్మానాలు చేసిన ఐదు ఏపీ పంచాయతీలు !


వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో స్పీకర్ స్ధానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ వారిని వారించారు. అయినా వారు వినిపించుకోలేదు అదే సమయంలో రఘురామ కూడా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో సభాధ్యక్ష స్ధానాన్ని ఉద్దేశించి మాట్లాడాలని రఘురామకు సూచించారు. దీంతో ఆయన తన అరచేతిని అడ్డుపెట్టుకుని మరీ మాట్లాడారు. తాను స్పీకర్ ను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నట్లు చెప్పారు.


కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు .. రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేయాలని కోరుతున్నారు. అయితే ఆయన పార్టీ ఫిరాయించకపోవడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తానుపార్టీలోనే ఉన్నానని.. పార్టీని విమర్శించడం లేదని..  ప్రభుత్వానికి సలహాలు మాత్రమే ఇస్తున్నానన్నారు. ఆయన ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూండటంతో అడ్డుకోవడం ఇతర ఎంపీలకు టాస్క్‌గా మారింది.