Payyavula Comments :   ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్రీలంక కంటే నాలుగు రెట్లు దారుణంగా ఉందని ఏపీ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.  సంక్షేమం అనే ముసుగులో ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక అరాచకం చాలా ఉందని  ఇదే విషయాన్ని కేంద్రం  మరోసారి చెప్పిందన్నారు. ఆర్థికమంత్రి  పూర్తిస్థాయి ఆడిట్‌కు సిద్ధపడతారా? లేక శ్వేతపత్రం విడుదల చేస్తారా? అని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అంతా సక్రమమేనని భావిస్తే..., ప్రత్యేక ఆడిట్‌ కు సిద్ధపడాలని సవాల్ చేశారు.  ఏపీలో వందలాది పీడీ అకౌంట్లకు  లెక్కలు లేవు, దీనిని నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు. 


దాదాపు రూ. 50 వేల కోట్ల  అప్పులకు సంబంధించిన ఖాతా వివరాలు ఆర్బీఐకి పంపించలేదని, దాచిన లెక్కలని బయటకు తీయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.  దేశంలోనే ఏ రాష్ట్రానికి ఇవ్వని క్వాలిఫైడ్ సర్టిఫికెట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాగ్ ఇచ్చిందన్నారు.  ఈ సంవత్సరం కూడ అకౌంటుకి సంబంధించి సంతకం పెట్టారన్నారు. ఆడిట్ ఆఫీసర్లు మాకు అందిన సమాచారం ఇది, మాకు అందని సమాచారం ఎంతో ఉందని ఎక్కడో చిన్న అక్షరాలలో రాశారని విమర్శించారు. 


 శ్రీలంక అప్పులతోటి కుప్ప కూలి పోయిందంటే శ్రీలంక కంటే ఆంధ్రప్రదేశ్ 4రెట్లు ఎక్కువ అప్పు చేసిందని, కనుక సంక్షోభం దిశగా వెళ్లామని పయ్యావుల గుర్తుచేశారు. శ్రీలంక సంక్షోభంలో ఉంటే ఇబ్బంది పడుతున్నది రాజ పక్స కుటుంబం, గొటబాయ కుటుంబం, పాలకులు కాదు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు. పారిపోయిన విజయమాల్య, గొటబాయ కుటుంబంలాగా ఆర్థిక సంక్షోభం వస్తే ఈ పాలకులు ఏటో పారిపోతారన్నారు.  శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు అంచన వేయడం కోసం కేంద్రం ఆర్థిక శాఖను, ఆర్బీఐ ని ఆదేశించిందని పయ్యావుల గుర్తుచేశారు. 


ఆర్బీఐ వాళ్ళు రిస్క్ ఎనాలసిస్ ని తయారు చేస్తూ ఒక నివేదికను కేంద్రం ఆర్థిక శాఖకు పంపారన్నారు. ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ మరొక నివేదికని తయారు చేసిందన్నారు. ఆ నివేదికలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తున్న రాష్ట్రాలు ఏవని గుర్తించింది. ఈ నివేదికని ప్రధానంగా ఇంటర్ నేషనల్ మానిటర్ ఫండ్ సూచనల మేరకు రిస్క్ ఎనాలసిస్ చేశారన్నారు. ఆర్బీఐ ఇదంతా కేంద్రం ఒత్తిడితో, ప్రతి పక్ష పార్టీల ఒత్తిడితో చేసింది కాదని పయ్యావుల తెలిపారు. వాళ్ళు ఇచ్చిన పది నివేదికలలో దాదాపు అన్నింటిలోను ఆంధ్రప్రదేశ్ ఒకటి రెండు స్థానాలు మారుతూ మొదటి స్థానంలోనే ఉందని పయ్యావుల తెలిపారు.  ఆదాయానికి అప్పులకి ఉన్న పరిమితికి ఎక్కడా సమతుల్యత లేదని ఆరోపించారు.