Bhadrachalam Five Villages :   ఏపీ, తెలంగాణ మధ్య  భద్రాచలం సమీపంలో ఉన్న ఐదు గ్రామాల మధ్య వివాదం ముదిరే అవకాశం కనిపిస్తోంది. తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆయా గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. ప్రస్తుతం అవి ఏపీ పరిధిలో ఉన్నాయి. ఆ గ్రామాలను తామే ఆదుకున్నామని ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. భద్రాచలం ముంపునకు గురి కాకుండా ఉండాలంటే ఆ ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాలని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత వివాదం మరింత ముదిరింది. వెంటనే ఐదు గ్రామాల ప్రజలు తీర్మానం చేయడం రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.


పల్నాడు జిల్లా సర్కార్ ఆఫీసులకు "పవర్" షాక్ - బిల్లులు కట్టట్లేదని కరెంట్ నిలిపివేత !


భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు ఉన్నాయి . ఏడు మండలాలను ఏపీలో కలిపినప్పుడు వీటిని కూడా కలిపారు.  అయితే ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయ్. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, వీఆర్‌ పురం, చింతూరు మండలాలను.. అలాగే పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు… అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. ఇలా ఈ ఐదు గ్రామాలు కూడా ఏపీ పరిధిలోకి వెళ్లిపోయాయి.


వరదలొచ్చాయిగా, పోలవరం ఆలస్యమవుతుందేమో-పార్లమెంట్‌లో కేంద్రమంత్రి వ్యాఖ్యలు


ఆ ఐదు గ్రామాల గురించి మొదటి నుంచి చర్చ జరుగుతోంది. గోదావరి వరద ముంపు వస్తే ఇబ్బంది అని టీఆర్ఎస్ నేతలుచాలా కాలంగా చెబుతున్నారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేస్తే  ముంపు ఉండదా అనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతోంది. అయితే   ఈ ఊర్ల నుంచి కరకట్ట నిర్మిస్తే ఇక గోదావరి వరదల నుంచి శాశ్వతంగా భద్రాచలం పట్టణానికి రక్షణ ఉంటుందన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన.


పోలవరం ప్రాజెక్ట్‌ కోసం సేకరిస్తున్న లక్ష ఎకరాలకు పైగా భూమి…. తెలంగాణ నుంచి ఏపీలో విడదీసిన ఏడు మండలాల పరిధిలోనే ఉంది. ఐతే ఇప్పుడు తెలంగాణ మంత్రి పువ్వాడ డిమాండ్‌ చేస్తున్న ఐదు ఊళ్లు అనేవి… కేవలం భద్రాచలం పట్టణాన్ని ముంపు నుంచి రక్షించడానికి కరకట్ట నిర్మించడం కోసమేనన్నది ఆయన వాదన. ఉమ్మడి రాష్ట్రంలోనే భద్రాచలంలో కరకట్ట నిర్మించారు. దాన్ని మరింత విస్తరించి… అస్సలు ప్రమాద పరిస్థితి రానీయవద్దన్నది పువ్వాడ డిమాండ్. దానికి తగ్గట్లుగానే ఆ గ్రామ పంచాయతీలు ఇపుడు తీర్మానం చేశాయి.