Jagan Mohan Reddy Mavigun Capital Proposal: ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ సాగుతున్న రాజకీయ చదరంగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గతంలో మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు తాజాగా మచిలీపట్నం- విజయవాడ-గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల పరిధిలో మావిగన్ కోస్తా అర్బన్ కారిడార్‌ను ప్రత్యామ్నాయ రాజధాని నమూనాగా తెరపైకి తెచ్చారు. అయితే, రాజకీయంగా ఈ నినాదం ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఒకవేళ జగన్ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని మార్చడం లేదా దాని పేరును మావిగన్ గా రూపాంతరం చేయడం చట్టపరంగా సాధ్యమేనా? అంటే.. న్యాయ నిపుణులు అసాధ్యం అనే సమాధానమే ఇస్తున్నారు. దీనికి కారణం అమరావతికి లభించిన అత్యున్నత రాజ్యాంగపరమైన మరియు పార్లమెంటరీ రక్షణే.
ఈ ప్రతిబంధకాల్లో అత్యంత కీలకమైనది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన నిర్ణయం. అమరావతి రాజధానిగా నిలదొక్కుకోవడానికి, భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారకుండా ఉండటానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం, 2026 ను ఉభయ సభల్లోనూ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక ఏకీకృత రాజధానిగా చట్టబద్ధమైన హోదా పొందింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ల ప్రకారం దేశంలో రాష్ట్రాల సరిహద్దులు, రాజధానుల ఏర్పాటుపై పార్లమెంట్‌కు సర్వాధికారాలు ఉంటాయి. కేంద్ర చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన సొంత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర చట్టాన్ని అధిగమించలేదు. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్ ప్రకారం.. రాజధానిని ఏకపక్షంగా మార్చే లేదా విభజించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు. ఇప్పుడు దానికి పార్లమెంట్ చట్టబద్ధమైన బ్యాకింగ్ కూడా తోడవడంతో రాజధాని మార్పు అనేది దాదాపు అసాధ్యంగా మారింది. రెండో ప్రతిబంధకం.. భూసేకరణ చట్టం మరియు రైతుల హక్కులు.
అమరావతి కోసం సుమారు 29,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద 33,000 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించారు. ఇది కేవలం ఒక భూసేకరణ కాదు.. రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య జరిగిన చట్టబద్ధమైన ఒప్పందం . ఒకవేళ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి మావిగన్ వైపు అడుగులు వేయాలని చూస్తే.. ఈ ల్యాండ్ పూలింగ్ ఒప్పందాల ఉల్లంఘన కింద కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయి. గతంలో మూడు రాజధానుల ప్రక్రియను కోర్టులు అడ్డుకోవడానికి ఇదే ప్రధాన కారణం. రైతుల ప్రయోజనాలను కాలరాస్తూ, ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేసిన అమరావతి మౌలిక సదుపాయాలను వదిలివేయడం ప్రజాధనం దుర్వినియోగం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇక మూడోది, అంతర్జాతీయ , జాతీయ ఆర్థిక సంస్థల ఒప్పందాలు
అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా భారీ ఎత్తున నిధులు, రుణాలు మంజూరవుతున్నాయి. ఈ ఒప్పందాలన్నీ అమరావతి అనే నిర్దిష్ట భౌగోళిక రాజధాని ప్రాంతం పేరుతోనే జరిగాయి. ఇప్పుడు హఠాత్తుగా మచిలీపట్నం లేదా గుంటూరు వైపు అడ్మినిస్ట్రేషన్‌ను తరలించి మావిగన్ కోరిడార్ అంటే.. ఆర్థిక సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడమే కాకుండా, రాష్ట్రంపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. ఇది ఏపీని కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుంది. వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ అనేది రాజకీయంగా మైలేజ్ పొందడానికి , వైఎస్సార్సీపీ క్యాడర్‌లో జోష్ నింపడానికి ఉపయోగపడే నినాదమే తప్ప, ప్రాక్టికల్‌గా , లీగల్‌గా సాధ్యం కాని వ్యవహారం. పార్లమెంట్ చేసిన అమరావతి ఏకైక రాజధాని చట్టాన్ని రద్దు చేయాలంటే మళ్లీ కేంద్రంలో పార్లమెంట్ మాత్రమే సవరణ చేయాలి తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ అధికారం ఉండదు. అందువల్ల జగన్ గెలిచినా, ఓడినా ఏపీ రాజధానిగా అమరావతి స్థానాన్ని మార్చడం కానీ, దాని అస్తిత్వాన్ని దెబ్బతీయడం కానీ చట్టబద్ధమైన రాజ్యాంగ వ్యవస్థల ముందు చెల్లకుండా పోతుందనేదే నిఖార్సైన నిజమని చెప్పుకోవచ్చు.
