TDP Counter Attack On YSRCP Amaravati:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  రాజధాని అమరావతి  చాప్టర్ ఎప్పుడూ అత్యంత సున్నితమైన, ఉద్వేగభరితమైన అంశం. సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక పరాజయం తర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఈ విషయంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, చేస్తున్న పర్యటనలు ఆ పార్టీకి మేలు చేయడం పక్కన పెడితే.. ప్రజల్లోకి తీవ్రమైన చర్చకు కారణం అవుతున్నాయి. తాజాగా అమరావతి పరిధిలో వైసీపీ నేతలు చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం, దానిని అడ్డం పెట్టుకుని అధికార తెలుగుదేశం పార్టీ  కూటమి తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజధాని విషయంలో వైసీపీ ఏం చేసినా అది ఆ పార్టీకే  సెల్ఫ్ గోల్  లా మారుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. 

Continues below advertisement

రాజధాని నిర్మాణాలను అడ్డుకోవడానికే కుట్రలు? 

అమరావతి రాజధానికి భూములు ఇవ్వడానికి ఇష్టపడని  అతికొద్ది మంది వ్యక్తులను, తమ పార్టీ సానుభూతిపరులను తెరపైకి తెచ్చి వైసీపీ సరికొత్త రాజకీయ నాటకానికి తెరలేపిందని టీడీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో పనులు శరవేగంగా పుంజుకుంటున్న తరుణంలో.. ఎలాగైనా ఈ పనులను అడ్డుకోవాలని, ఇక్కడ మళ్లీ వివాదాలు రాజేయాలనే కుట్రతోనే వైసీపీ నేతలు ఈ పర్యటనలు పెట్టుకున్నారని టీడీపీ నేతలు  అంటున్నామని. తాము అధికారంలో ఉంటే మావిగన్  అంటామని, విపక్షంలో ఉంటే మళ్లీ అమరావతి ఆపేస్తామని మాట్లాడే నేతలు ఇక్కడికి వస్తే.. సహజంగానే రైతులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని కూటమి శ్రేణులు వాదిస్తున్నాయి. రౌడీషీటర్ల ఎంట్రీ వివాదం 

Continues below advertisement

వైసీపీ నేతల పర్యటనలో స్థానిక రైతులు కాకుండా.. గతంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై భౌతిక దాడులకు పాల్పడిన నిందితులు, పలువురు పేరుమోసిన రౌడీషీటర్లు ఉండటం ఆ పార్టీని మరింతగా డిఫెన్స్‌లో పడేసింది. శాంతిభద్రతల సమస్యను సృష్టించడానికే రౌడీ మూకలతో రాజధాని గ్రామాల్లోకి వచ్చారనే విమర్శలకు వైసీపీ బలమైన కౌంటర్ ఇచ్చుకోలేకపోయింది.  ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీ వ్యూహాత్మకంగా తీవ్రమైన పొరపాటు చేసింది. నిజంగానే అమరావతి పరిధిలో భూ నష్టపరిహారం లేదా ల్యాండ్ పూలింగ్ విషయంలో ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే, వారు న్యాయపోరాటం  చేసుకోవడానికి లీగల్ సెల్ ద్వారా సహాయం చేయడం పూర్తిగా వేరు. కానీ, అలా కాకుండా వందలాది మంది అనుచరులతో, వివాదాస్పద వ్యక్తులతో రాజధాని ప్రాంతంలోకి ప్రవేశించి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ద్వారా.. రాజధాని అభివృద్ధికి తాము పూర్తిగా వ్యతిరేకమనే పాత ముద్రను వైసీపీ స్వయంగా మరింత బలోపేతం చేసుకున్నట్లయింది. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి రాజకీయంగా ఒక అయాచిత అస్త్రాన్ని అందించింది.

రాజధాని విషయంలో టీడీపీ ఎదురుదాడి 

 టీడీపీకి విమర్శలు గుప్పించడానికి మంచి అవకాశం దొరికింది.   ఐదేళ్ల పాటు అమరావతిని  శ్మశానం అని, 'భూ కుంభకోణం' అని అవహేళన చేసిన వైసీపీ.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడ తిరుగుతోందని మంత్రులు లోకేష్, నారాయణలు నిలదీస్తున్నారు. తాము అమరావతిని గ్లోబల్ సిటీగా మారుస్తుంటే.. వైసీపీ మళ్లీ విధ్వంసానికి ప్లాన్ చేస్తోందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో టీడీపీ విజయవంతమైంది. దీనివల్ల అమరావతి సెంటిమెంట్ ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు  ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీపై మరింత వ్యతిరేకత పెరుగుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

వైసీపీకి ఓ స్థిరమైన విధానం లేకపోవడమే సమస్య 

 రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్సీపీ  ఒక స్పష్టమైన,  స్థిరమైన విధానానికి   రావలసిన అవసరం  ఉందని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు మావిగన్, మూడు రాజధానుల ముసుగును వదలకుండా.. మరోవైపు అమరావతిలో హక్కుల పోరాటం అంటూ రెండు పడవల ప్రయాణం చేయడం వల్ల రాజకీయంగా ఎలాంటి మైలేజ్ రాదు. ప్రజల నాడిని పసిగట్టకుండా ఇలాంటి ఉద్రిక్త పర్యటనలు కొనసాగిస్తే, రాబోయే రోజుల్లో పార్టీ ఉనికి క్షేత్రస్థాయిలో మరింత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.