Amaravati Farmers Demands To Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు సమావేశం అయ్యారు. అమరావతి రాజధాని విషయంలో ఇరుపక్షాల మధ్య తీవ్రమైన రాజకీయ, చట్టపరమైన పోరాటం నడవడం, తాజాగా మావిగన్ రాజధానిని ప్రతిపాదించిన సమయంలో ఈ తాజా భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వచ్చిన అమరావతి జేఏసీ, రాజధాని ప్రాంత రైతు ప్రతినిధులు ఆయనతో సుదీర్ఘంగా ముచ్చటించారు. గతంలో మూడు రాజధానుల నిర్ణయం వల్ల తమ భూములు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయని రైతులు ఈ సందర్భంగా జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే నాటి నిర్ణయం వెనుక ఏ ప్రాంతానికీ అన్యాయం చేయాలనే ఉద్దేశం తనకు లేదని, అన్ని ప్రాంతాల సమాంతర అభివృద్ధే తన లక్ష్యమని జగన్ రైతులకు వివరించారు. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు, చేదు అనుభవాలను పక్కన పెట్టి, రాష్ట్ర హితం కోసం కలిసి ముందడుగు వేయాల్సిన సమయం వచ్చిందని జగన్ తెలిపారు.
రైతులు జగన్ తో ఏమన్నారు?
ఈ సమావేశంలో రైతులు తమకు ఎదురవుతున్న ప్రస్తుత క్షేత్రస్థాయి ఇబ్బందులను మాజీ సీఎంకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. అమరావతిలో పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని, భూములు ఇచ్చిన రైతులకు రావాల్సిన వార్షిక కౌలు, ప్లాట్ల అభివృద్ధి వంటి అంశాల్లో ఇంకా జాప్యం జరుగుతోందని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు జరిగిన మేలును గుర్తు చేసుకున్న వారు.. వైఎస్సార్ వారసుడిగా జగన్ కూడా తమకు అండగా నిలబడాలని, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ లోపల, బయట అమరావతి రైతుల హక్కుల కోసం పోరాడాలని కోరారు. పలువురు రైతులు భూసమీకరణలో ఇంకా భూములు ఇవ్వలేదు. ఆ భూముల్ని భూసమీకరణ ద్వారా తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ సమస్యలపైనా జగన్ తో చర్చించారు.
అండగా ఉంటానని జగన్ హామీ
రైతుల విజ్ఞప్తులపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. అమరావతి కోసం భూములిచ్చిన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వనని ఆయన స్పష్టం చేశారు. మీరు రాష్ట్రం కోసం త్యాగం చేసి భూములు ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రతిపక్ష పార్టీగా మేము నిరంతరం ఒత్తిడి తెస్తాం అని జగన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోందని... ఆ అవినీతికే వ్యతిరేకమని అమరావతి కాదన్నారు.
రాజకీయ సమీకరణాల్లో మార్పులు?
అమరావతి అంటేనే వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకం అనే ముద్రను చెరిపేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజధాని రైతులతో జగన్ నేరుగా చర్చలు జరపడం ద్వారా.. భవిష్యత్తులో అమరావతి వేదికగా కొత్త రాజకీయ వ్యూహాలు అమలు చేయబోతున్నారనే సంకేతాలు వెళ్లాయి. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, అమరావతి అభివృద్ధికి తమ పార్టీ ఎప్పుడూ అడ్డుకాదనే కొత్త లైన్‌ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఈ భేటీ ద్వారా జరిగిందని భావిస్తున్నారు.
