Telangana Congress Coordination Failure Debts Open Debate: తెలంగాణ రాజకీయాల్లో గత రెండు రోజులుగా నడుస్తున్న ఓపెన్ డిబేట్ హైడ్రామా అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పుల లెక్కల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వేసిన అడుగులు, చివరకు అధికార పార్టీనే డిఫెన్స్‌లోకి నెట్టేలా మారడం వెనుక ఒక స్పష్టమైన సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆలోచించే పొలిటికల్ స్ట్రాటజీ ఒకలైన్ లో ఉంటే.. క్యాబినెట్ మంత్రులు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు మరొకలా ఉండటమే ఈ పొలిటికల్ మిస్-ఫైర్‌కు ప్రధాన కారణమని భావిస్తున్నారు.
అసెంబ్లీ వేదికగా చర్చలకు రేవంత్ సవాల్
నిజానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటరీ, అసెంబ్లీ సాంప్రదాయాలను బాగా వంటబట్టించుకున్న నేత. ఆయన ప్రతిపక్షాలకు విసిరే సవాళ్లు ఎప్పుడైనా సరే అసెంబ్లీ వేదికగానే ఉంటాయి. ఎందుకంటే, అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా అధికారిక డేటా, స్పీకర్ పోడియం, మైక్ కంట్రోల్ ఉండే సభలోనే చర్చకు ప్రాధాన్యత ఇస్తుంది. సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, శ్వేతపత్రం ఇచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని కార్నర్ చేయడం ఈజీ. రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ కూడా అదే. దమ్ముంటే అసెంబ్లీకి రండి, తేల్చుకుందాం అనడం వెనుక పూర్తి హోంవర్క్, అధికారిక అధికారాలు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్‌ను, ఆయన అండర్ కరెంట్ స్ట్రాటజీని అర్థం చేసుకోవడంలో సీనియర్ మంత్రులు పూర్తిగా విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పొలిటికల్ స్టేట్‌మెంట్‌ను వ్యక్తిగత సవాల్‌గా తీసుకుని కొందరు మంత్రులు రోడ్డుపైకి రావడం కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది.
జూపల్లి ప్రకటనను అడ్వాంటేజ్‌గా తీసుకున్న బీఆర్ఎస్
మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకపక్షంగా నేనే తెలంగాణ భవన్‌కు వస్తా అని ప్రకటించడం, ఆ తర్వాత గన్ పార్క్ అమరవీరుల స్థూపం అనడం, చివరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వేదికను మార్చడం వంటి పరిణామాలు అధికార పార్టీలో ఉన్న అభద్రతా భావాన్ని, అయోమయాన్ని క్యాడర్‌కు స్పష్టం చేశాయి. సీఎం ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుంటే, మంత్రులు వ్యక్తిగత ప్రతిష్టల కోసం వీధి చర్చలకు వేదికలు ప్రకటించి చివరకు పోలీసు బలగాల సహాయంతో ప్రతిపక్ష నేతలను గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేయించాల్సి వచ్చింది. సవాల్ విసిరిన అధికార పార్టీనే చివరకు శాంతిభద్రతల పేరుతో వెనక్కి తగ్గడం ద్వారా బీఆర్ఎస్‌కు అనూహ్యమైన పొలిటికల్ మైలేజ్ లభించింది.
కాంగ్రెస్ రాజకీయ పరిస్థితుల్ని వినియోగించుకున్న కేటీఆర్, హరీష్ రావు
ఈ సమన్వయ లేమిని పక్కాగా ఉపయోగించుకోవడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు నూటికి నూరు శాతం సఫలమయ్యారు. జూపల్లి కోసం తెలంగాణ భవన్‌లో ఖాళీ కుర్చీ వేసి మీడియా ముందు కూర్చోవడం ద్వారా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపారు. మరోవైపు హరీష్ రావు ఆర్‌బీఐ, కాగ్ నివేదికలతో పాటు స్వయంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన పాత వీడియో క్లిప్పింగ్స్‌ను వాట్సాప్ ద్వారా జూపల్లికి పంపి, ప్రభుత్వ డేటాలోనే స్పష్టత లేదు, మీ మంత్రుల వద్ద సరైన లెక్కలు లేవు అని నిరూపించే ప్రయత్నం చేశారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలు హోంవర్క్ లేకుండా ఆవేశపడ్డారనే ఇంప్రెషన్ పడింది.
కాంగ్రెస్ అంతర్గత సమన్వయలోపాన్ని దిద్దుకోవాల్సిందే!
కాంగ్రెస్ అధిష్టానం , సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ అంతర్గత సమన్వయ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కనిపిస్తోందంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం విసిరే ప్రతి చిన్న ట్రాప్‌లోనూ మంత్రులు చిక్కుకుపోతే.. ప్రభుత్వ పాలన పక్కకుపోయి కేవలం రోజువారీ వివాదాలకే పరిమితం కావాల్సి వస్తుంది. ప్రెస్ మీట్లు, వీధి సవాళ్ల ద్వారా అప్పుల లెక్కలు తేలవనే కనీస సత్యాన్ని మంత్రులు గుర్తించాలి. ఇలాంటి విషయాలను శాసనసభ వేదికగానే ఎదుర్కోవాలనే రేవంత్ రెడ్డి మార్క్ రూట్‌ను మంత్రులు ఎప్పుడు తెలుసుకుంటారు? ఒక పద్ధతి ప్రకారం పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లకుంటే.. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇలాంటి మరిన్ని మైండ్ గేమ్స్‌తో అధికార పార్టీని నిరంతరం డిఫెన్స్‌లోకి నెడుతూనే ఉంటుంది.
