Ysrcp Internal Issues : ఇక ఇంతా సైలెంట్ గ‌న్నవరం అయినా మ‌చిలీప‌ట్టణం అయినా ఎవ్వరూ నోరు మెద‌ప‌వ‌ద్దు. మీ ప‌నులు మీరు చూసుకోండి. గ‌డ‌ప గ‌డ‌ప‌కు వెళ్లండి. ప్రతి ఇంటి త‌లుపు త‌ట్టండి. మాట్లాడండి. ధైర్యంగా స‌మ‌స్యల‌ను ఎదుర్కోండి. అధినేత జగన్ నుంచి ఆ నాయ‌కులకు ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో ఎవరికి వారు తమ ప‌నుల్లో ప‌డ్డారు. అవును ఇదంతా నిజ‌మే అంటున్నాయి పార్టీ వర్గాలు. గ‌న్నవ‌రంలో గ్రూపు రాజ‌కీయాలు. ఇక మ‌చిలీప‌ట్టణంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాల‌శౌరి మ‌ధ్య విభేదాల‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫుల్ స్టాప్ పెట్టార‌నే ప్రచారం జ‌రుగుతుంది. ప్రభుత్వ స‌ల‌హాదారు సజ్జల‌ ఆయా నాయ‌కుల‌కు ఈసమేర‌కు మైండ్ వాష్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటింటికి వెళ్లి స‌మ‌స్యలు తెలుసుకోవ‌టంతో పాటుగా ప్రజ‌ల్లో ఉండి వారి క‌ష్టాల‌ను తీర్చేందుకు రూట్ మ్యాప్ ను పెట్టుకోవాల‌ని స్పష్టంగా ఆదేశాలు రావ‌టంతో నాయ‌కులు ఇప్పుడు ఎవ్వరూ వివాదాల వైపు చూడ‌టం లేదు. 


గన్నవరం గరం గరానికి చెక్


గ‌న్నవరం నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే 2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు వైసీపీకి దుట్టా రామ‌చంద్రరావు పార్టీకి నేతృత్వం వ‌హించారు. ఎన్నిక‌ల త‌రువాత వైసీపీ ఊహించ‌ని రీతిలో 151 సీట్లు గెల్చుకొని అధికార ప‌గ్గాలు చేప‌ట్టంతో రాజ‌కీయాలు మారిపోయాయి. టీడీపీ నుంచి గెలుపొందిన వ‌ల్లభ‌నేని వంశీ వైసీపీకి మద్దతు తెలిపారు. నేరుగా పార్టీ కండువా క‌ప్పుకోక‌పోయినా, జ‌గ‌న్ ను క‌ల‌సి సంఘీభావం తెల‌ప‌టంతో పాటుగా, టీడీపీ నేత‌లపై వంశీ, మాజీ మంత్రి కొడాలి నానితో క‌లిసి ఎదురు దాడి చేయ‌టంతో సీఎం జ‌గ‌న్ దృష్టిని ఆక‌ర్షించగ‌లిగారు. దీంతో వంశీకే నియోజ‌క‌వ‌ర్గ బాధ్యతలను  అప్పగించేందుకు జ‌గ‌న్ స‌ముఖంగా ఉన్నార‌ని ప్రచారం జ‌రిగింది. ఇటీవ‌ల గ‌న్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో వైసీపీ నేత యార్లగ‌డ్డ వెంక‌ట‌రావు వంశీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేశారు. అదే స‌మ‌యంలో మరో నాయకుడు దుట్టా కూడా యార్లగ‌డ్డతో శృతి క‌లిపారు. దీంతో వంశీ కూడా అదే స్థాయిలో ఇరు వ‌ర్గాల‌కు కౌంట‌ర్ ఇవ్వటంతో రాజకీయంగా తీవ్ర స్థాయిలో దుమారం చెల‌రేగింది. అధికార పార్టీ నాయ‌కుల్లో విభేదాలు చ‌ర్చకు దారి తీశాయి. దీంతో సీఎం జ‌గ‌న్ తో స‌మావేశం అయిన వంశీ జ‌రిగిన విష‌యాల‌న్నీ ఆయ‌న దృష్టిలో పెట్టారు. ఆ త‌రువాత ఈ వ్యవ‌హ‌రంపై స‌ల‌హాదారు స‌జ్జల కూడా నియోజ‌క‌వ‌ర్గ నేత‌లో స‌మావేశం అయ్యి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఎవ్వరూ బ‌హిరంగంగా మాట్లాడ‌కుండా ఎవ‌రి పని వారు చేసుకోవాల‌ని స్పష్టమ‌యిన ఆదేశాలు జ‌గ‌న్ ఇచ్చార‌ని, సజ్జల గ‌న్నవ‌రం నాయ‌కుల‌కు స‌మాచారం ఇవ్వటంతో అంతా సైలెంట్ అయ్యారు. 


మ‌చిలీపట్టణంలో కూడా ఇదే తీరు


ఇక మ‌చిలీప‌ట్టణంలో కూడా ఇదే వివాదం పార్టీని రోడ్డుకు లాగింది. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాల‌శౌరి వ‌ర్గాల మ‌ధ్య వివాదం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేసింది. పేర్నినాని వ‌ర్గం ఒక కార్యక్రమంలో ఎంపీ బాల‌శౌరిని అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రోటోకాల్ పాటించ‌కుండా నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌చ్చారని ఆందోళ‌న చేశారు. దీనిపై ఎంపీ బాల‌శౌరి సీరియ‌స్ అయ్యారు. మాజీ మంత్రి పేర్నినానిపై ఆరోప‌ణ‌లు చేశారు. స్థానిక టీడీపీ నాయ‌కుల‌తో క‌లిసి పేర్ని నాని తిరుగుతున్నార‌ని ఫైర్ అయ్యారు. అయితే ఈ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్నినాని ఎక్కడా ఎటువంటి కామెంట్స్ చేయ‌లేదు. దీంతో ఈ వివాదంపై కూడా జ‌గ‌న్ ప‌క్కా స‌మాచారం తెప్పించుకొని, ఆదేశాలు ఇచ్చారని నేత‌లు చెబుతున్నారు. ఎవ‌రి పనులు వారు చేసుకొని వివాదాల్లోకి రాకుండా ఉండాలని క్లారిటీ ఇచ్చారంట‌. దీంతో ఈ వివాదాలపై ఇరు వ‌ర్గాల నాయ‌కులు నోరు మెద‌ప‌కుండా కామ్ గా వారి ప‌నుల్లో వారు బిజిగా ఉంటున్నారు.