Amaravati Case : ఏపీ రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో త్వరగా విచారణ జరిపాలని ఏపీ ప్రభుత్వం పదే పదే సుప్రంకోర్టు వద్ద ప్రస్తావిస్తోంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం తొందరపడటం లేదు. సీజేఐ బెంచ్ ముందు ప్రస్తావించాలని తాజాగా ఏపీ ప్రభుత్వ లాయర్లు నిర్ణయించారు. సోమవారం ప్రస్తావించవచ్చు. అయితే ఈ కేసులో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని జస్టిస్ కేఏం జోసెఫ్ వ్యాఖ్యానించడంతో ఈ విషయం రాజ్యాంగ ధర్మాసనం వద్దకు వెళ్తుందా అన్న చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది. అమరావతి ఉద్యమంలో ఉన్న కొంత మంది రాజ్యాంగ ధర్మాసనానికి ఇవ్వాలని పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రకటించారు.
రాజ్యాంగ ధర్మాసనానికి ఇవ్వాలని వచ్చే వారం పిటిషన్ !
ఆంధ్రప్రదేశ్ రాజధానుల వివాదం కేసుపై విచారణ రాజ్యాంగ ధర్మాసనం చేపట్టాలని అమరావతి జేఏసీ సుప్రీంకోర్టును కోరాలని నిర్ణయించుకుంది. వారం రోజుల్లో సుప్రీంకోర్టులో తాము స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని జేఏసీ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి ప్రకటించారు. ఐదుగురు లేదా ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రాజధాని కేసుపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని అమరావతి జేఏసీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేఎం జోసెఫ్ ఈ కేసు రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపడి ఉందన్నారని శాస్త్రి గుర్తు చేశారు. రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉన్నపుడు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంటుందని అంటున్నారు. రాజధాని విషయంలో నిర్ణయాధికారం ఎవరికి ఉందన్నదే ఇక్కడ మౌలికంగా తలెత్తిన ప్రశ్న అని, కేంద్రం ఇచ్చిన అఫిడవిట్, పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానాలను బట్టి చూస్తే రాజ్యాంగ ధర్మాసనం అవసరమని స్పష్టంగా అర్థమవుతోందని అంటున్నారు న్యాయ నిపుణులు.
రాజ్యాంగ ధర్మాసనాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు ?
సుప్రీంకోర్టులో సున్నితమైన అంశాలతోపాటు ప్రధాన అంశాలపై రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటుకు అధికారికంగా ఎటువంటి మార్గదర్శకాలు, విధానాలు లేవు. బెంచ్‌ల ఏర్పాటు రెండు రకాలు. ఇద్దరు న్యాయమూర్తులతో ఒక బెంచ్ ఏర్పాటవుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, అవసరమైనప్పుడు మాత్రమే విస్తృత బెంచ్ ల ఏర్పాటు జరుగుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) ప్రత్యేకించి ఒక బెంచ్‌కు మాత్రమే కేటాయిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీచేసే అధికారం ఉన్నది. సుప్రీంకోర్టు అధిపతిగా చీఫ్ జస్టిస్‌కు బెంచ్‌ల ఏర్పాటు, కేసుల కేటాయింపుపై విచక్షణాధికారాలు ఉంటాయి. ఇందులో రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయని సీజేఐ భావిస్తే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయవచ్చు.
రాజ్యాంగ ధర్మాసనానికి ఇస్తే మరింత ఆలస్యం అవుతుందా ?
అమరావతి కేసు క్లిష్టమైనదే. న్యాయవ్యవస్థ అత్యంత అరుదుగా ప్రకటించే రిట్ ఆఫ్ మాండమస్‌ను తీర్పులో హైకోర్టు ప్రకటించింది. అయితే మూడు రాజధానులపై తమకు చట్టం చేసుకునే అధికారం ఉందని.. అది న్యాయవ్యవస్థ కాదనొలేని ప్రభుత్వం వాదిస్తోంది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం చట్టాలు చేసుకుంటోంది. ఒక్క మూడు రాజధానుల అంశంపైనే రిట్ ఆఫ్ మాండమస్ ఇచ్చింది హైకోర్టు. అది కూడా రాజ్యాంగ విరుద్ధమేనని ప్రభుత్వంవాదన. తమ అధికారాల్లో కోర్టు జోక్యం చేసుకుంటోందని అంటున్నారు. ఇప్పుడు ఈ అంశం క్లిష్టంగా మారుతోంది. సుప్రీంకోకర్టు తీర్పుతో ఓ క్లారిటీ రావాల్సి ఉంది. రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపితే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.