AP BJP Crisis : సీనియర్ రాజకీయ నేత, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పొమ్మన కుండా పొగపెడుతున్నారని, తన అనుచరులను పార్టీ పెద్దలు టార్గెట్ చేస్తున్నారని, తన వారి వద్ద అన్నారట కన్నా. ఆయన కమలం పార్టీతో కలిసి పనిచేయలేకపోతున్నారని ఇప్పటికే టాక్స్ వినిపిస్తున్నాయి. పలు సందర్భాలలో బీజేపీ నాయకులపై కన్నా చేసిన కామెంట్లు ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. మొత్తానికి కన్నా పార్టీ మారడం ఖాయం అంటున్నారు అయన ఫాలోవర్లు.
కన్నాను టార్గెట్ చేసిన సోము వీర్రాజు
కన్నా లక్ష్మీనారాయణ.. వంగవీటి మోహనరంగా అనుచరుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనకు కొద్ది రోజుల ముందు సీఎం రేసులో కూడా ఉన్నారు కన్నా. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినా 2014 ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉన్న సందర్భాలలో అనేక పార్టీలు వైసీపీ, బీజేపీ పార్టీలు పోటీ పడి మరీ కన్నా లక్ష్మీ నారాయణను తమ పార్టీలోకి ఆహ్వానించాయి. బీజేపీ పట్టుపట్టి పార్టీలో చేర్చుకొని రాష్ట్ర అధ్యక్షుడు పదవిని అప్పగించింది. అప్పటి వరకు ప్రధాన పార్టీలతో సంబంధాలు నడుపుతూ వారి ఆదేశాలు పాటిస్తూ ఉన్న బీజేపీ నాయకులు కార్యక్రమాలలో మార్పు తెచ్చారు కన్నా. టీడీపీ, వైసీపీ నాయకులను ఢీకొట్టే స్థాయికి క్యాడర్ ను బలోపేతం చేశారు. తర్వాత కన్నా స్థానంలో సోము వీర్రాజు ఏపీ అధ్యక్షుడుగా నియమించింది బీజేపీ. అప్పటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణతో పాటు పార్టీలోకి వచ్చిన నాయకులను సోము వీర్రాజు టార్గెట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. కన్నాను బలహీన పరిచేందుకు కన్నా అనుచరులను సోము వీర్రాజు టార్గెట్ ఆరోపణలు వచ్చాయి. కనీసం సమాచారం ఇవ్వకుండా కన్నా నియమించిన జిల్లా నాయకులను తొలగించి వారి స్థానంలో తన వారిని పెట్టుకున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున పార్టీని చుట్టుముట్టాయి.
సోము వీర్రాజు, జీవీఎల్ పై ఆగ్రహం
పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కన్నా లక్ష్మీ నారాయణ పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. పార్టీని సోము వీర్రాజు బలహీన పరుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనను ఉపయోగించుకోవడంలో ఏపీ బీజేపీ విఫలమైందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ లీడర్ ను వాడుకోవడం సోము వీర్రాజు చేతకావడం లేదని స్పష్టం చేశారు. అశేష అభిమానులు ఉన్న జనసేన అధ్యక్షుడితో లైజనింగ్ లేకపోవడమే ఏపీలో బీజేపీ ఎదుగుదల లేకపోవడానికి కారణమని తెలిపారు. కన్నా జీవీఎల్ నర్సింహరావుని కూడా వదలలేదు రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకోకుండా జీవీల్ మాట్లాడుతున్నారని, జాతీయ నాయకుడిగా రాజధాని అమరావతి అంశంలో చేసిన వ్యాఖ్యలు సరికాదని కుండ బద్దలు కొట్టారు.
జనసేన లేక టీడీపీనా
రాష్ట్ర నాయకత్వంపై మీడియా వేదికగా బహిరంగ యుద్ధానికి సిద్ధపడ్డారు. అవకాశం కల్పించుకొని మరీ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక కన్నా పార్టీ వీడనున్నారని పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం అయితే జరుగుతున్నాయి. టీడీపీతో టచ్ లో ఉన్నారని ఒకరంటే, జనసేన తో టచ్‌లో ఉన్నారని మరొకరోజు ప్రచారం జరుగుతుంది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వయంగా గుంటూరులో కన్నా ఇంటికి వచ్చి ఆయనతో ఏకాంతంగా చర్చించడం సంచలనంగా మారింది. కన్నా రేపో మాపో జనసేన పార్టీలో చేరడం కన్ఫాం అన్న వార్తలు వచ్చాయి. అయితే కన్నా తనను నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. సొంత సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ లాంటి సీనియర్ నేత పవన్ కల్యాణ్ కు తోడుగా ఉంటే మరింత ఆదరణ లభిస్తోందని జనసేన భావిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీతో కన్నా టచ్ లో ఉన్నారని సత్తెనపల్లి, లేదా గుంటూరు పశ్చిమ నుంచి కన్నా పోటీ చేస్తారని వదంతులు వచ్చాయి. ఆ వార్తలు గురించి ఎవరు స్పందించలేదు. కాని కన్నాతో పాటు జిల్లా వ్యాప్తంగా అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పైగా కాపు కమ్యునిటీ కూడా అండగా ఉంది. కన్నా జనసేనలో చేరితే బాగుంటుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
కన్నా అనుచరులు వరుస రాజీనామాలు
సామాజిక మధ్యమాలలో కన్నా కొండగట్టులో పవన్ ను కలిసి జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారు అనే వార్తలు హల్ చల్ చేశారు. ఇవన్నీ ప్రచారమే అనితేలిపోయింది. కానీ భవిష్యత్తులో మాత్రం కన్నా జనసేనలో చేరే అవకాశం లేకపోలేదని అంటున్నారు ఆయన అనుచరులు. కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియర్ పవన్ కు సలహాలు ఇస్తే జనసేన పార్టీకి మరింత ప్రయోజనం జరగటం ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటికే కన్నా అనుచరులు బహిరంగాంగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. పెదకూరపాడులో సమావేశం ఏర్పాటు చేసి సోము వీర్రాజుపై మండిపడ్డారు. అతని వైఖరికి విసిగిపోయామని చెబుతున్నారు. మూకుమ్మడిగా బీజేపీ పార్టీకి రాజీనామాలు చేసి పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ వ్యవహారం మొత్తం కన్నా కనుసన్నలలో జరుగుతుందని సమాచారం.