Visakha Capital : దిల్లీ వేదికగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్టణం అని, త్వరలోనే తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని ప్రకటించారు.  అయితే ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. వరుసగా పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. అది అలా అయితే ఇది ఎలా...అబ్బే అది సాధ్యం కాదంటూ, కాదు సాధ్యమేనంటూ ఎవరికి వారు వాదనలు మొదలుపెట్టేశారు. ఆ విషయాలు ఏంటంటే... విశాఖపట్టణం రాజధాని అని సీఎం జగన్ ప్రకటించారు. ఆయన చెప్పాక ఇంకెవరు ఏం మాట్లాడతారు. అదే జరుగుతుందని కొందరు నేతలు అంటుంటే, ఇదే సమయంలో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. రాజధానికి వెళ్లాలంటే, అంతకు ముందు జరగాల్సిన వ్యవహరాలు అన్నీ ఆశామాషీ కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కొందరు అవును అంటూనే, ముఖ్యమంత్రి రేంజ్ లో జగన్ వెళ్లి విశాఖపట్టణంలో కుర్చుంటే, మిగిలినవి వాతంతట అవే వస్తాయంటూ, పార్టీ నేతలు కొందరు ధీమాగా చెబుతున్నారు. అయితే కొందరు ఈ విషయానికి నిజమే అంటూనే అంత ఈజీనా అంటూ సందేహాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. సచివాలయం, అందులోని హెచ్ఓడీలు, వివిధ శాఖలు, దిగువ స్దాయి అధికారులు, సిబ్బంది, ఇలా అందరూ తట్టాబుట్టా సర్దుకొని, బెజవాడ నుంచి విశాఖపట్టణానికి వెళ్లటమా..అంటూ ఊహల్లోకి వెళుతున్నారు. రాజధాని  ఒక  ప్రాంతం  నుంచి  ఇంకో  ప్రాంతానికి  వెళ్లడం పెద్ద  ప్రాసెస్.. ఎన్నికల ముందు సీఎం ఈ  ప్రాసెస్ ను అమలుచేయటం అంత ఈజీనా అంటూ కొందరు అధికారులు సైతం, తమను కలిసిన పార్టీ ముఖ్య నేతల వద్ద సందేహాలు చెబుతున్నారంట. 


అప్పుడు...ఇప్పుడు 


రాజధాని తరలింపు వ్యవహరంపై ప్రభుత్వ వర్గాలు అప్పుడు ఇప్పుడూ అంటూ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014లో హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్ట్ అవ్వటానికి జరిగిన ప్రయత్నాలు గురించి ఆలోచిస్తున్నారు. అప్పట్లోనే అత్యంత క్లిష్టంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. విజయవాడలో తాత్కాలిక కార్యాలయాలు, అద్దెకు ఇళ్ళు వెతుక్కున్నారు. అదే సమయంలో అమాంతంహా పెరిగిన ఇళ్ల అద్దెలు, అప్పటి సీఎం చంద్రబాబు ఇంటి అద్దెల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేయటం...ఇలాంటి పదనిసలు అన్నీ ఇప్పుడు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. సీఎంగా ఉన్న వ్యక్తి రాజధాని అంటూ విశాఖపట్టణానికి వెళ్లి అక్కడ నుంచి పని చేయటానికి ముందు కూడా కొన్నిసదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా సీఎంవో అధికారులకు ఏర్పాట్లు జరగాలి, ఆ తరువాత సీఎంకు ప్రత్యేక సదుపాయాలు, భద్రత వంటి అంశాలు అత్యంత కీలకం.. ఇదే సమయంలో దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, వారికి అందాల్సిన సదుపాయాలు, ప్రోటోకాల్, వంటి తతంగాలు, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రాన్ని గుర్తించే విధంగా వాతావరణం ఏర్పాటు చేయటం...ఇలా ప్రతిది సవాలే. 


మనుషులు వచ్చారు కానీ 


హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు చేసిన సమయంలో చాలా మంది ఉద్యోగులు, విజయవాడకు వచ్చారు కాని, వారి మనస్సులు మాత్రం ఇప్పటికి హైదరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఆంధ్రప్రదేశ్ సచివాలయం పూర్తిగా బోసిబోతుంది. అధికారులు అంతా హైదరాబాద్ కు వెళ్ళిపోతారు. అక్కడ వాతావరణానికి ,విజయవాడ లో వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉండటం కూడా ఇందుకు ప్రధాన కారణమని అంటుంటారు. ఇలాంటి పరిస్థితులు చాలా వెంటాడుతున్న సమయలో ఇప్పుడు మరోసారి విశాఖపట్టణానికి రాజధాని అని జగన్ చేసిన కామెంట్స్ తో ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.