Kotamreddy Tapping Issue : తన ఫోన్ ట్యాప్ చేశారని ఇంటలిజెన్స్ చీఫ్ తనకు ఆధారం పంపించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందన్న ఆరోపణలపై ఆధారాలు బయటపెడతానని ప్రకటించిన ఆయన ఈ రోజు ప్రెస్ మీట్‌లో ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు తనకు పంపిన ఆడియో క్లిప్ ను మీడియాకు చూపించారు. ‘నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారు. ముందు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నమ్మలేదు. సీఎం జగన్‌పై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించారు. 20 రోజుల ముందు నా ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికిందని కోటంరెడ్డి ప్రకటించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నాననే తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు.
కొన్ని రోజుల క్రితం తన బాల్య మిత్రుడితో ఐ ఫోన్‌లో మాట్లాడానని కోటంరెడ్డి తెలిపారు. తన స్నేహితుడితో మాట్లాడిన విషయాలపై ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయలు తనకు ఫోన్ చేసి అడిగారన్నారు. దానికి సంబంధించి ఆయన ఫోన్ నుంచే ఆడియో పంపారన్నారు. ట్యాపింగ్ జరిగిందనడానికి ఇంతకుమించిన ఆధారాలు ఇంకేం కావాలని కోటంరెడ్డి ప్రశఅనించారు. ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఆడియో క్లిప్ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇక తన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో చెప్పాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ‘నేను ట్యాపింగ్ అంటున్నా.. కాదంటే మీరు నిరూపించండి’ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. దేశద్రోహులు, స్మగ్లర్లపైనే అనుమతి తీసుకుని ట్యాప్ చేస్తారని, ప్రభుత్వ పెద్దలే ఫ్లోన్లు ట్యాపింగ్ చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలని కోటంరెడ్డి ప్రశ్నించారు.
ఇలాంటి ప్రెస్‌మీట్ పెట్టాల్సి వస్తుందనుకోలేదన్న కోటంరెడ్డి వైసీపీకి, జగన్ కు తాను ఎప్పుడూ విధేయంగానే ఉన్నానన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడ్డానని, అధికారంలోకి వచ్చాక గుర్తింపు ఇవ్వకపోయినా బాధపడలేదన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలను భరించానని, పార్టీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ నిజమని తెలిసి మనస్తాపం చెందానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 15 నెలల తర్వాత ప్రజలు ఎలా తీర్పు ఇస్తారో ఎవరికీ తెలియదని, నాయకుడే నమ్మకపోతే ఇక తాను పార్టీలో ఎందుకుండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
పార్టీ నుంచి వెళ్లేవారు వెళ్లొచ్చని బాలినేని శ్రీనివాసరెడ్డి తనను ఉద్దేశించి అన్నారని.. అవి సీఎం అన్న మాటలుగానే భావిస్తున్నానన్నారు. జగనన్నా.. నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలా ఉంటుందని సీఎంను ప్రశ్నించారు. మీరు తప్పు చేసి ట్యాపింగ్ జరగలేదని అబద్ధాలు చెబుతారా?’’ అంటూ కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.నలుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు తనకు ఫోన్ చేశారని తెలిపారు. తమ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని వారు చెప్పారని, దేనికైనా తాను సిద్ధమేనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ ఒక ఎమ్మెల్యేతో ఆగదని, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, జడ్జిల ఫోన్లూ ట్యాప్ చేస్తారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. హైకోర్టు సీజే ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తారన్నారు.తెలుగుదేశం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని, టీడీపీ తరపున పోటీపై నిర్ణయం చంద్రబాబుదేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.