Telangana PCC Chief: తెలంగాణ నూతన పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన నేతకు ఏఐసీసీ అధిష్టానం కీలక పదవి అప్పగించింది. దీంతో బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదవీ కాలం జులై 7వ తేదీతో పూర్తైంది. అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేసింది. ఎట్టకేలకు మహేష్ కుమార్ గౌడ్‌ను పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీగౌడ్, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అయితే, మహేష్‌కుమార్‌గౌడ్‌ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆయన 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ కొనసాగుతున్నారు.






ఇదీ రాజకీయ నేపథ్యం



  • బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966, ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం రహత్ నగర్‌లో జన్మించారు. డిగ్రీ చదివే రోజుల్లో విద్యార్థి దశలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

  • 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2013 - 14 సమయంలో ఏపీ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా చేశారు.

  • 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

  • 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించగా.. అధిష్టానం మైనార్టీలకు కేటాయించడంతో మహేష్ కుమార్ పోటీ నుంచి తప్పుకొన్నారు. సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితులయ్యారు.

  • 2021 జూన్ 26న పీసీసీ కార్య నిర్వహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023లో టీపీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అయ్యింది. ఈ ఏడాది జనవరి 31న ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు ఏఐసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు.


Also Read: TGSPDCL: 'లంచం అడిగితే ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి' - విద్యుత్ వినియోగదారులకు సంస్థ సీఎండీ కీలక సూచన