Vinesh Phogat Bajrang Punia officially joins Congress party : హర్యానా ఎన్నికల కోసం కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.  ఒలంపిక్స్ లో ఫైనల్‌కు చేరి అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేష్ ఫోగట్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.  ఆట‌కు ఇప్ప‌టికే గుడ్ బై చెప్పిన వినేష్ ఫోగట్ రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నారు.  వినేష్ తో పాటు మ‌రో రెజ్ల‌ర్ బ‌జ‌రంగ్ పూనియా కూడా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరుతున్నందున రైల్వేలో ఉన్న ఉద్యోగానికి వినేష్ ఫోగట్ రాజీనామా చేశారు. 


అక్టోబ‌ర్ 5న హ‌ర్యానా ఎన్నిక‌లు  జరగనున్నాయి.  బీజేపీ ఇప్ప‌టికే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.  కాంగ్రెస్ పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించడానికి కసరత్తు చేస్తోంది. వీరిద్దరికీ టిక్కెట్లు హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. అందుకే వీరిద్దరికీ కోరుకున్న చోట నుంచి  పోటీ చేసే అవకాశం దక్కనుంది.   వినీష్ ఒలంపిక్స్ నుండి స్వ‌దేశానికి వ‌చ్చిన రోజే కాంగ్రెస్ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  తర్వాత వీరిద్ద‌రూ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీని కూడా క‌లిశారు.  గ‌తంలో వినీష్ ఫోగట్ సోద‌రి బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా బీజేపీ నుంచి వీరికి ఆఫర్ వచ్చినా .. కాంగ్రెస్ లోనే చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 


 





 


వినేష్  ఫోగట్ గతంలో బీజేపీ నేత అయిన రెజ్లింగ్ ఫెడరేషన్ లో చక్రం తిప్పే బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా  పోరాటం చేశారు. ఆయన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రెజ్లర్లు అందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆ ఆందోళనలో వినేష్ ఫోగట్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో క్రీడాకారులంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ వైపు ఆమె ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. అదే సమయంలో హర్యానాలో బీజేపీ కన్నా కాంగ్రెస్ అయితేనే మంచి రాజకీయ  భవిష్యత్ ఉంటుందన్న ఉద్దేశంతో ఆ పార్టీలో చేరినట్లుగా చెబుతున్నారు. 


హర్యానాలో భజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ లకు మంచి క్రేజ్ ఉంది. ఆ రాష్ట్రంలో రెజ్లింగ్ పై యువతకు ఆసక్తి ఎక్కువ. అక్కడి యువత వీరిని రోల్ మోడల్స్ గా తీసుకుంటారు. అందుకే ఈ ఇద్దరు రెజ్లర్ల వల్ల భారీగా  మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తులు పెట్టుకుని అయినా ఈ సారి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.