TGSPDCL Numbers To Complaint On Corruption: విద్యుత్ శాఖలో అవినీతిని నిర్మూలించేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖి చర్యలు చేపట్టారు. సంస్థకు చెందిన సిబ్బంది లేదా అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. సంస్థ పరిధిలో ఎవరైనా సిబ్బంది లేదా అధికారులు లంచం అడిగితే 040 - 2345 4884 కు గాని లేదా 7680901912 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
'విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి గాను మా సంస్థ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోంది. కొంతమంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. ఈ క్రమంలో వినియోగదారుల సమస్యలు/ఫిర్యాదులు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు, క్యాటగిరీ మార్పు, టైటిల్ ట్రాన్స్ ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలు పొందేందుకు సంస్థ వెబ్‌సైట్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించాం. సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణం కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి ఉంది. ఉద్యోగులు వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.' అని సీఎండీ పేర్కొన్నారు.