Babu Mohan Meet Chandrababu In Hyderabad: ప్రముఖ హాస్యనటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ (Babu Mohan) ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) కలిశారు. ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పర్యటనలో ఉన్న చంద్రబాబును బాబూమోహన్ కలవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ బీజేపీలో ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి అనంతరం ప్రజాశాంతి పార్టీలో చేరారు. అయితే, ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా చంద్రబాబును కలవడం ఆసక్తికరంగా మారింది. గతంలో టీటీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందిన బాబూమోహన్ మంత్రిగా పనిచేశారు.


తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా


మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో నేతలకు కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో అన్ని టీడీపీ కమిటీలను రద్దు చేసిన ఆయన.. పార్టీ సభ్యత్వాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని ఆదేశించారు. పెద్దఎత్తున సభ్యత్వాలు చేసిన నేతలకి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. రెండు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనేది తమ అభిమతమని అన్నారు. కొందరు నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయినా.. గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. పని తీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని వారిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తామని అన్నారు. నెలలో రెండుసార్లు తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని.. అందరినీ కలిసి అభిప్రాయాలు తీసుకుంటానని అన్నారు.


Also Read: Nagarjuna: ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదు, కోర్టు తీర్పును గౌరవిస్తా: నాగార్జున