Tollywood Actor Nagarjuna tweet over N convention and mention court order | హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదంపై టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున మరో ట్వీట్ చేశారు. ఎన్ కన్వెన్షన్ ను పక్కా పట్టా ఉన్న భూమిలో నిర్మించినట్లు మరోసారి స్పష్టం చేశారు. ఒక్క అంగుళం భూమి కూడా మేం ఆక్రమించలేదని, అయితే సెలబ్రిటీల విషయం వచ్చే సరికి భూతద్దంలో పెట్టి చూస్తారని నాగ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ అంటూ కీలక విషయాలు పోస్ట్ చేశారు.
ఎన్ కన్వెన్షన్ లో కొన్ని ఎకరాల భూమి కబ్జా చేసి నిర్మించినట్లు హైడ్రా శనివారం కీలక ప్రకటన చేయడం తెలిసిందే. అందుకు నాగార్జున కౌంటరిస్తూ.. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి తుమ్మిడికుంట చెరువు భూమిలో ఎలాంటి ఆక్రమణ జరగలేదని 24 ఫిబ్రవరి 2014న కోర్టు తీర్పు (Sr.3943/2011) ఇచ్చినట్లు నాగార్జున స్పష్టం చేశారు. హైకోర్టులో ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. చట్టాలను తానెప్పుడూ గౌరవిస్తానని, ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఎలాంటి ఊహాగానాలు, అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. వాస్తవాలు చెప్పడానికి తాను ఈ ట్వీట్ చేశానని, తమది పట్టా భూమి అని.. ఒక్క అంగుళం కూడా కబ్జా చేసింది కాదని నాగ్ స్పష్టం చేశారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా
మాదాపూర్ పరిధిలోని తుమ్మిడికుంట చెరువుకు చెందిన స్థలంలో నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఆరోపణలున్నాయి. గతంలోనే నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, హైడ్రా సిబ్బంది కలిసి శనివారం (ఆగస్టు 24న) ఉదయం ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. అనంతరం కూల్చివేతలపై హైడ్రా ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్మాణాలను, చెరువులు కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను గతంలో ఇచ్చిన నోటీసుల మేరకు కూల్చివేసినట్లు తెలిపారు.
తుమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు హైడ్రా పేర్కొంది. FTL పరిధిలో ఒక ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాల 18 గుంటలు (మొత్తం 3 ఎకరాల 30 గుంటల) భూమిని ఆక్రమించి నిర్మించారని ఓ ప్రకటనలో హైడ్రా తెలిపింది. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వలేదని, ఏ కోర్టు సైతం స్టే ఇవ్వలేదని రంగనాథ్ తెలిపారు. 2014లో హెచ్ఎండీఏ ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL), బఫర్ జోన్‌లో నిర్మాణాలపై తొలిసారి నోటిఫికేషన్ ఇవ్వగా, 2016లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. 2014లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఓనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటారని కోర్టు తెలిపినట్లు చెప్పారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఓనర్ సమక్షంలో ఎఫ్‌టీఎల్ పరిధిపై సర్వే చేశారని హైడ్రా తెలిపింది. దీనిపై ఎన్ కన్వెన్షన్ 2017లో మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టును ఆశ్రయించగా.. కేసు పెండింగ్ లో ఉంది. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోకూడదని కానీ ఏ కోర్టులోనూ స్టే లేదని స్పష్టం చేసింది.