CPI Narayana sensational comments against Actor Nagarjuna | హైదరాబాద్: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసింది. నాగార్జున హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలను మినహాయించిన మిగతా పార్టీల రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖుల నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ క్రమంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను సీపీఐ నేత నారాయణ సమర్థించారు.


రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి పని చేసింది


ఎన్ కన్వెన్షన్ కూల్చిన ప్రాంతాన్ని సీపీఐ నేత నారాయణ పరిశీలించిన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం  అక్రమ కట్టడాలను కూల్చివేయడం మంచిదే అన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బుసలు కొట్టినా, తరువాత సైలెంట్ అయిందనంటూ సెటైర్లు వేశారు. BRS ప్రభుత్వం చేయలేని పనిని, ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తుందని ప్రశంసించారు. ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడతూ.. అక్కినేని నాగార్జున మంచి నటుడు కావచ్చు. కానీ కక్కుర్తి ఎందుకు అని ప్రశ్నించారు. జీవితం అంటే సినిమా డైలాగులు కొట్టడం కాదని, ఇప్పటికైనా బుకాయింపు మాటలు వద్దు అని హితవు పలికారు. ఆక్రమించి చేపట్టిన నిర్మాణం కనుక ప్రజలకు నాగార్జున క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతకాలం వరకు ఎన్ కన్వెన్షన్ ద్వారా ఫంక్షన్లు, రాజకీయ కార్యక్రమాలు, ఇతర కమర్షియల్ ఈవెంట్లతో సంపాదించిన దానిపై తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జున పరిహారం కట్టాలని సీపీఐ నారాయణ సూచించారు.


నీతి వ్యాఖ్యలు వద్దంటూ సీపీఐ నారాయణ ఫైర్


ప్రముఖులు చెరువులు కబ్జా చేయడం వల్ల వర్షం పడితే సామాన్యులకు నరకం కనిపిస్తోంది. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి నేతలు నీతి మాటలు చెబుతున్నారు. కానీ కబ్జాల కారణంగా వర్షం పడితే పలు కాలనీలను వరద నీరు ముంచెత్తుతోంది. హైదరాబాద్ నగరంలో అరగంట నుంచి గంటపాటు వర్షం పడితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయి, వాహనాలు భారీగా నిలిచి పోతున్నాయి. కనుక కబ్జా అయిన చెరువు స్థలాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం మంచి విషయం అన్నారు. చెరువులు, ఇతర జలాశయాల భూమిని, ఇతర ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవాళ్లు స్థలాన్ని తిరిగిచ్చేయాలని నారాయణ సూచించారు. సామాన్యులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మద్దతు ఉంటుందని సీపీఐ నారాయణ తెలిపారు.


Also Read: HYDRA Report: ఆ ప్రముఖుల కట్టడాలను కూల్చివేసిన హైడ్రా, ప్రభుత్వానికి కీలక నివేదిక