KL Rahul: నంబర్ 5లో నంబర్ 1గా రాహుల్ - చివరి 17 ఇన్నింగ్సుల్లో ఈ 5 ది బెస్ట్!
క్రికెట్ ఒక ఫన్నీ గేమ్! ఎప్పుడేం జరుగుతుందో తెలియదు! అదే సమయంలో క్రికెట్ ఒక క్రూరమైన క్రీడ! బాగా ఆడని ఆటగాళ్లను అస్సలు క్షమించదు! ప్రతిభకు కొదవలేకున్నా వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా పట్టించుకోదు! అభిమానుల దృష్టిలో టీమ్ఇండియాలోకి ఎంపికైన ప్రతి ఆటగాడు ప్రతి మ్యాచులోనూ ఆడాల్సిందే! వాళ్లూ మాములు మనుషులే అన్న సంగతి మర్చిపోతారు!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ విషయంలోనూ ఇంతే! అతడిలో ప్రతిభ ఎంతున్నా వరుసగా నాలుగైదు మ్యాచులు విఫలమైతే చాలు విమర్శలు కురిపించేస్తారు. జట్టు యాజమాన్యం అండగా నిలబడినా అభిమానులు ఊరుకోలేదు. ఇంపాక్ట్ చూపించని ఆటగాడికెందుకు అవకాశాలు ఇస్తున్నారని ట్వీట్ల వర్షం కురిపించారు.
ఇప్పుడీ విమర్శలను రాహుల్ పటాపంచలు చేశాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో సాధికారిక ఇన్నింగ్స్‌తో మ్యాచ్ గెలిపించేశాడు. ఈ ఫార్మాట్లో ఐదో స్థానానికి తనకన్నా మెరుగైన ఆటగాడు లేడని చాటుతున్నాడు. కేవలం 15 ఇన్నింగ్సుల్లో ఐదుసార్లు సంక్లిష్ట పరిస్థితుల్లోనే నిలబడ్డాడు.
కొన్నాళ్ల కిందట జరిగిన న్యూజిలాండ్ సిరీసులో రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాడు. 156/3తో టీమ్ఇండియా విలవిల్లాడుతుంటే కేఎల్ 64 బంతుల్లోనే 88 పరుగులతో అజేయంగా నిలిచాడు. 347/4కు తీసుకెళ్లాడు. మరోసారీ అంతే. 62/3తో ఇబ్బంది పడుతుంటే 113 బంతుల్లో 112తో చెలరేగాడు. 296/7తో విజయం అందించాడు.
బంగ్లాదేశ్ మ్యాచులో భారత్ 49కే 3 వికెట్లు చేజార్చుకొంది. అప్పుడు రాహులే 70 బంతుల్లో 73 పరుగులు చేసి స్కోరును 186కు చేర్చాడు. ఇక శ్రీలంకపై 86/4తో విలవిల్లాడుతుంటే కేఎల్ 103 బంతుల్లో 64తో అజేయంగా నిలిచాడు. 219 లక్ష్యాన్ని ఛేదించాడు.
ఇక నిన్నటి ఆస్ట్రేలియా మ్యాచులో టీమ్ఇండియా లక్ష్యం 189. కానీ 39కే 4 వికెట్లకు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. బంతి స్వింగ్ అవుతుండటంతో అంతా ఇబ్బంది పడ్డారు. కానీ రాహుల్ 91 బంతుల్లో 75 నాటౌట్‌తో విజయం అందించేశాడు. నంబర్ 5లో అతడిని మించిన నంబర్ వన్ ఇప్పట్లో ఎవరూ లేనట్టుగా ఆడుతున్నాడు.