స్టీల్‌ప్లాంట్ రగడ నుంచి టైమ్ మ్యాగజీన్ ప్రతిభాశీలురైన లిస్ట్ వరకు ఈ వారం అప్డేట్స్ సూటిగా మీకోసం
స్టీల్‌ప్లాంట్‌పై జరిగిన ప్రకటనలే ఈ వారానికి హైలెట్. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే తాము బిడ్ వేస్తామని చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్... సింగరేణి తరఫున టీంను కూడా అక్కడకు పంపించారు. తర్వాత రోజే విశాఖలో పర్యటించిన కేంద్రసహాయమంత్రి ఫగన్ సింగ్ చేసిన ప్రకటన అందర్నీ గందరగోళపరిచింది. ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గుతున్నట్టు చెప్పారు. అంతే పార్టీలన్నీ క్రెడిట్ గేమ్ స్టార్ట్ చేశాయి. ఇది గడిచి గంటల్లోనే కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది. స్టీల్ ప్లాంట్ అమ్మే విషయంలె వెనక్కి తగ్గడం లేదని. దీంతో అప్పటి వరకు సంబరాలు చేసుకున్న పార్టీల గాలిని కేంద్రం ఒక్కసారిగా తీసేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కృతమైంది. శుక్రవారం అంబేడ్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణలో బౌద్ధ గురువులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అంబేద్కర్ స్మృతి వనాన్ని సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్ సందర్శించారు. రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆ పూల వర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నినదించారు. అక్కడున్న ప్రజాప్రతినిధులంతా చప్పట్లతో పూల వర్షాన్ని స్వాగతించారు.
భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో తేలింది. వీరి లెక్క ప్రకారం AP సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ రూ.510 కోట్లని నివేదిక తెలిపింది. ఆ జాబితా ప్రకారం అందరికంటే జగనే సీఎంలు అందరిలో ధనవంతుడు. ఆస్తుల విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిట్టచివరన ఉన్నారు. ఆమె పేరిట కేవలం 15 లక్షల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి.
ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ నేతగా ఉన్నప్పుడు ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో కుట్ర కోణం లేదని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ స్పష్టం చేసింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు టీడీపీ సానుభూతి పరుడు కాదని తెలిపింది. అలాగే ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్‌కు అసలు ఈ ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కోర్టులో ఎన్ఐఏ తరపున కౌంటర్ దాఖలు చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిభాశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజీన్ (Time magazine) విడుదల చేసింది. ఇందులో, RRR సినిమాలో పాటకు ఆస్కార్ అందుకోవడంతో పాటు ప్రపంచన్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జక్కన్న (ఎస్.ఎస్. రాజమౌళి) తొలిసారి చోటు సంపాదించాడు, మరోమారు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచంలోని వ్యాపారవేత్తలు, గాయకులు, అధ్యక్షులు, కళాకారులు, రచయితలు, ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు టైమ్ మ్యాగజీన్ లిస్ట్‌లో ఉన్నారు. టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన వరల్డ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2023 లిస్ట్‌లో ఉన్నారు. బాలీవుడ్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), ఇండియన్ అమెరికన్ రచయిత సల్మాన్ రష్దీ (Salman Rushdie), టెలివిజన్ హోస్డ్ & జడ్జ్ పద్మ లక్ష్మి (Padma Lakshmi) కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు.
దేశంలోనే పురాతన మెట్రో సర్వీసు కోల్‌కతా మెట్రో చరిత్ర సృష్టించింది. భారత దేశంలోనే తొలిసారిగా ఓ మెట్రో.. నది కింద వేగంగా దూసుకెళ్లింది. హౌరా నుంచి కోల్‌కతాలోని ఎస్ప్లానేడ్ వరకు హుగ్లీ నది కింద రైలును నడిపారు. కోల్‌కతా నగరానికి ఈ రన్ చారిత్రాత్మక ఘట్టమని కోల్‌కతా మెట్రో జనరల్ మేనేజర్ పి ఉదయ కుమార్ రెడ్డి అభివర్ణించారు. హుగ్లీ నదిలో.. రైలు వెళ్లడం ఇదే తొలిసారని ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది 33 మీటర్ల లోతులో ఉన్న అత్యంత లోతైన స్టేషన్. భారత్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి. కోల్‌కతా నగరానికి ఇది చారిత్రాత్మక ఘట్టం. వచ్చే 7 నెలల పాటు హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు ట్రయల్ రన్ కొనసాగుతుందని తెలిపారు. దీని తర్వాత ప్రజల కోసం రెగ్యులర్ గా ప్రారంభిస్తారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడులో బీఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదం జరిగింది. బాణసంచా నిప్పు రవ్వలు ఓ ఇంటిపై పడి సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఒకరే మృతి చెందినప్పటికీ పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ల శరీరభాగాలు ముక్కలు అయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. పది లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.2లక్షలు, పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.
బీబీసీపై ఈడీ కేసు నమోదు చేసింది. Foreign Exchange Management Act కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించింది. విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించింది. రెండు నెలల క్రితం దాదాపు మూడు రోజుల పాటు ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాల్లో సర్వే నిర్వహించారు. అప్పట్లో అది సంచలనమైంది. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు అప్పుడు వెల్లడించారు. ఈ సర్వే పూర్తైన తరవాత బీబీసీ కీలక ప్రకటన చేసింది. అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. కానీ ఈలోగా ఈడీ షాక్ ఇచ్చింది. విదేశీ నిధుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు పలువురు ఉద్యోగులను విచారించినట్టు తెలుస్తోంది. కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలించినట్టు సమాచారం. ఇవాళ మరో BBC ఉద్యోగిని పిలిచారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు చూపించాలని అడిగారు. కొన్ని ప్రశ్నలు కూడా వేశారు అని ఓ అధికారి స్పష్టం చేశారు. గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీ వివాదాస్పదం అయినప్పటి నుంచి కేంద్రం ఉద్దేశపూర్వకంగా బీబీసీని టార్గెట్ చేసిందన్న ఆరోపణలున్నాయి.
యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్‌ను ఎన్కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతడి హస్తమూ ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే Uttar Pradesh Special Task Force అసద్‌ను ఎన్కౌంటర్ చేసింది. డీఎస్పీతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. అసద్‌తో పాటు అతని సన్నిహితుడు గులాంపై కాల్పులు జరిపింది. వాళ్ల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకుంది. వీరిద్దరి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డు ఇస్తామని ఇప్పటికే యూపీ పోలీసులు ప్రకటించారు. ఈలోగా వాళ్ల జాడ తెలుసుకుని వెంటాడిన పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్‌ను హత్య జరిగిన సమయంలో సీసీటీవీలో అసద్ కూడా కనిపించాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చివరకు వాళ్ల ఆచూకీ కనుక్కొని ఎన్కౌంటర్ చేసింది. ముందు గులాం పోలీసులపై ఫైరింగ్ జరిపాడు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలోనే అసద్, గులాం ప్రాణాలు విడిచారు.