International Yoga Day 2024: గడ్డకట్టే చలిలోనూ యోగాసనాలు, ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయకుండా ఉండలేం

పదో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని భారత సైనికులూ ఘనంగా జరుపుకున్నారు. మంచు పర్వతాలు, ఎత్తైన కొండల పైనా ప్రతికూల వాతావరణాన్ని లెక్క చేయకుండా యోగాసనాలు వేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అటు ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్లో యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనగా అదే స్ఫూర్తితో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లు యోగ చేశారు. కన్యాకుమారి, అండమాన్ నికోబార్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

గడ్డకట్టుకుపోయే చలిలోనూ భారత సైనికులు యోగాసనాలు వేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆఫీసర్ల సమక్షంలో సైనికులంతా కలిసి యోగ చేశారు. ప్రాణాయామంతో పాటు పలు ఆసనాలు వేశారు.
ఢిల్లీలో కరియప్పా పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ సిబ్బంది యోగ వేడుకల్లో పాల్గొంది. ఢిల్లీతో పాటు తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో పర్వతాలపైన సైనికులు యోగాసనాలు వేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
నార్తర్న్ ఫ్రంట్ వద్ద భారత ఆర్మీ యోగ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అంత చలిలోనూ ప్రత్యేక దుస్తులు వేసుకుని యోగాసనాలు వేశారు. ఆ తరవాత అంతా కలిసి జాతీయ జెండాని పట్టుకుని ఫొటో దిగారు. ఆర్మీతో పాటు నేవీ సిబ్బంది కూడా సముద్రం మధ్యలోనే షిప్‌పై యోగాసనాలు వేశారు.
భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ మిషన్స్‌లో ఉన్న ఇండియన్ ఆర్మీ కాంటింజెంట్స్లో యోగ దినోత్సవ వేడుకలు జరిగాయి. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ థీమ్‌కి అనుగుణంగా అన్ని చోట్లా సైనికులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
యోగ కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. పైగా యోగ సమాజానికి ఎంత మేలు చేస్తుందో చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సారి థీమ్‌ని నిర్ణయించారు.
గతేడాది కూడా అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఇంతే ఉత్సాహంతో జరుపుకున్నారు భారత సైనికులు. యోగా డే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి పదో వార్షికోత్సవం సందర్భంగా రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు.