Nihir Kapoor Interview: అమ్మ 'రికార్డ్ బ్రేక్' కథ వినలేదు, నేను ఓకే చేశాక చెప్పా: జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ ఇంటర్వ్యూ
సహజ నటి జయసుధ తనయుడు నిహిర్ కపూర్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'రికార్డ్ బ్రేక్'. మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నిహిర్ కపూర్ మీడియాతో ముచ్చటించారు. హీరోగా నిహిర్ తొలి సినిమా 'రికార్డ్ బ్రేక్' అయినప్పటికీ... ఇంతకు ముందు 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' సినిమాలో విలన్ రోల్ చేశారు. అందులో చదలవాడ శ్రీనివాసరావు తనయుడు లక్ష్య్ హీరో. ఆ సినిమా చేసేటప్పుడు 'రికార్డ్ బ్రేక్' కథ చెప్పారని, కథతో పాటు క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఓకే చేశానని నిహిర్ కపూర్ తెలిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'రికార్డ్ బ్రేక్' కథ గురించి నిహిర్ కపూర్ మాట్లాడుతూ... ''ఈ సినిమాలో నేను, మరొక హీరో నటించాం. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ రోల్స్ చేశాం. వాళ్లిద్దరూ అనాథలు. ఓ అడవిలో పెరిగిన వాళ్లు... కుస్తీ పోటీలు నేర్చుకుని ఇంటర్నేషనల్ స్థాయిలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరకు వెళ్లడం సినిమా కథ'' అని చెప్పారు. 'దంగల్' ఈ తరహా కథ అయినప్పటికీ... అందులో, ఇందులో వేర్వేరు ఎమోషన్స్ ఉంటాయని నిహిర్ చెప్పారు. మదర్ సెంటిమెంట్, యాక్షన్, కుస్తీ పోటీలు 'రికార్డ్ బ్రేక్'ను కొత్తగా మార్చాయని అన్నారు.
'రికార్డ్ బ్రేక్' కథ విన్నాక, ట్రైలర్ చూశాక జయసుధ ఏమన్నారు? అని ప్రశ్నించగా... ''అమ్మ ట్రైలర్ చూశారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా చూశారు. ట్రైలర్ అయితే అమ్మకు చాలా నచ్చింది. సినిమా పూర్తిగా చూశాక ఏం చెబుతారోనని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అమ్మ బిజీగా ఉండటంతో కథ వినలేదు. నేనే విని ఒకే చేశా. తర్వాత కథ చెప్పా. 'యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నావ్' అని మెచ్చుకున్నారు'' అని నిహిర్ కపూర్ వివరించారు.
కుస్తీ నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరకు 'రికార్డ్ బ్రేక్' కథలో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఈతరం ప్రేక్షకులకు సైతం నచ్చుతుందని నిహిర్ కపూర్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగు హీరోలు, దర్శక నిర్మాత తీసిన సినిమా అయినప్పటికీ ప్రతి భారతీయుడు గర్వించేలా ఉంటుందన్నారు. అందుకే, తెలుగుతోనే ఆగిపోకూడదని, ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని చెప్పారు.
చదలవాడ శ్రీనివాసరావు గురించి నిహిర్ కపూర్ మాట్లాడుతూ... ''ఆయనకు సినిమా అంటే పాషన్. ఎప్పుడూ ఒక సోషల్ సబ్జెక్ట్, కాన్సెప్ట్ తీసుకుని సినిమాలు చేస్తారు. ఇది కూడా అటువంటి సినిమాయే. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు జాషువా గారు చేశారు. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కొత్తగా ఉంటుంది'' అని చెప్పారు.
'రికార్డ్ బ్రేక్' తర్వాత వరుసగా సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు నిహిర్ కపూర్ చెప్పారు. హీరోగా మాత్రమే కాకుండా మంచి సినిమాల్లో క్యారెక్టర్లు వచ్చినా సరే చేస్తానని చెప్పారు.
ఒకప్పుడు హీరో అంటే క్లీన్ గా, నీట్ గా ఉండాలని అనుకునేవారని, 'కెజియఫ్' తర్వాత అంతా మారిందని, గడ్డంతో రఫ్ గా కనిపించడం న్యూ ట్రెండ్ అని నిహిర్ కపూర్ చెప్పారు.