Apsara Rani: అప్సర... పరుచూరి క్లాప్‌తో కొత్త సినిమా షురూ, హీరో ఎవరంటే?
గ్లామర్ గాళ్ అప్సరా రాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ సినిమాలతో ఆమె పాపులర్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు. అయితే... ఆవిడ హీరోయిన్ కూడా! అప్సరా రాణి కథానాయికగా కొత్త సినిమా మొదలైంది. ఆ వివరాలు ఏమిటంటే?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appత్రిగుణ్ హీరోగా వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రై.లి. పతాకంపై కృష్ణబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో అప్సరా రాణి హీరోయిన్. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో నల్లా శ్రీదేవి నిర్మిస్తున్న చిత్రమిది. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. అప్సరా రాణి మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించగా... ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టారు. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చిత్ర ప్రారంభోత్సవంలో దర్శకుడు కృష్ణబాబు మాట్లాడుతూ... ''ఏప్రిల్ 20న రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం. అప్పటి నుంచి పది రోజుల పాటు ఒక షెడ్యూల్ చేస్తాం. త్రిగుణ్ (అరుణ్ ఆదిత్య), అప్సర రాణి జంట ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తాం'' అని చెప్పారు.
అప్సరా రాణి మాట్లాడుతూ... ''మంచి రోజున మంచి సినిమా ప్రారంభం కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా నటిగా నా ప్రయాణానికి ఎంతో హెల్ప్ అవుతుందన్న నమ్మకంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని తెలిపారు.
సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ... ''నాకు కథ బాగా నచ్చింది. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. పాటలు చాలా బాగా వచ్చాయి. అందరిని ఆకట్టుకుంటాయి. పాటలతో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుంది'' అని చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత మాట్లాడుతూ... ''కృష్ణబాబు అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. నిజాయితీగా సినిమా చేస్తున్నాం. హీరో త్రిగుణ్ ఈ సినిమాకు దొరికిన ఆణిముత్యం. అప్సరా రాణి నిబద్దతతో, అంకితభావంతో పని చేసే హీరోయిన్'' అని చెప్పారు.
త్రిగుణ్, అప్సరా రాణి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, బేబీ వినూత, ఉదయ్ భాను ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కృష్ణ బాబు, నిర్మాత: నల్లా శ్రీదేవి, సహా నిర్మాత: చైతన్య కిరణ్, సంగీతం: ఎంఎం శ్రీలేఖ.